ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటలకు గృహప్రవేశం, ఆపై పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రహ్మణీ సంప్రదాయ దుస్తుల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చంద్రబాబు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి టీడీపీ శ్రేణులతో పాటు నియోజకవర్గ ప్రజలకు కూడా ఆహ్వానం వెళ్లాయి. ఉదయం 10 గంటలకు టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలను చంద్రబాబు దంపతులు కలుసుకోనున్నారు. అలాగే గృహప్రవేశ వేడుకకు వచ్చే అతిథులందరికీ పసందైన వంటకాలతో విందు కూడా ఏర్పాటు చేశారు. 30 వేల మందికి భోజనం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.కాగా, కుప్పం చంద్రబాబుకు కంచుకోట. 1989 నుంచి 2024 ఎన్నికల వరకు వరసగా 8 సార్లు కుప్పంలో ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలుపొందారు. అక్కడి ప్రజలు బాబును తమ సొంత మనిషిలాగా ఆదరిస్తుంటారు. కానీ సొంత నిజయోవర్గంలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేకపోవడంపై ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని కుప్పం ప్రజలకు బాబును దూరం చేసేందుకు గట్టి ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ అవేమి ఫలించలేదు.
ఇక చంద్రబాబు విమర్శలకు చెక్ పెట్టేందుకు మూడేళ్ల క్రితం శివపురం వద్ద కుప్పం-పలమనేరు నేషనల్ హైవే పక్కన దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇటీవలె నిర్మాణ పనలు పూర్తి కావడంతో తాజాగా కొత్తింటికి గృహప్రవేశం చేసి అక్కడి ప్రజలకు చంద్రబాబు మరింత చేరవయ్యారు.