వైసీపీ హయాంలో కన్ను మిన్ను తెలియకుండా నోరు పారేసుకున్న నేతలకు, అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన నాయకులకు కూటమి ప్రభుత్వం దడ పుట్టిస్తోంది. ఒకరి తర్వాత ఒకరిని జైలుకు పంపుతోంది. అయితే వైసీపీలో నెక్స్ట్ అరెస్ట్ మాజీ మంత్రి జోగి రమేష్ దేనా..? టార్గెట్ ఫిక్సయిందా..? ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ అడ్డంగా ఇరుక్కున్నారు.
పేద మధ్యతరగతి ప్రజల నుంచి భారీగా డిపాజిట్లను సేకరించిన అగ్రిగోల్డ్ సంస్థ.. ఆ డబ్బుతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో రాపిడ్ గ్రోత్ ఏరియాల్లో భూములను కొనుగోలు చేయడమే కాకుండా భవనాలను సైతం నిర్మించింది. కోట్లు విలువ చేసే ఆస్తులు కూడపెట్టుకుని డిపాజిట్లు వేసిన అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెట్టింది. ఈ వ్యవహారంలో అగ్రిగోల్డ్ యాజమాన్యంపై కేసు నమోదు కావడంతో.. సీఐడీ రంగంలోకి దిగి ఆ సంస్థ కొనుగోలు చేసిన భూములను స్వాధీనం చేసుకుంది. అయితే ఈ భూముల్లో విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలోని భూములు కూడా ఉన్నాయి. వాటినే జోగి రమేష్ కుటుంబం అక్రమంగా కాజేసింది.
మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని.. ఏకంగా సీఐడీ, ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఈ భూములను కొనుగోలు చేసినట్టుగా నకిలీ పత్రాలు రెడీ చేసి, వాటినే ప్లాట్లుగా మార్చి విక్రయించారు. అడ్డుగోలుగా అవినీతికి పాల్పడి భారీగా లబ్దీ పొందరు. ఈ కథంతా జోగి రమేష్ వెనకుండి నడిపించగా.. ఆయన తనయుడు జోగి రాజీవ్, సోదరుడు జోగి వెంకటేశ్వరరావు ముందుండి నడిపించారు. ఇప్పటికే ఈ భూ దందా వ్యవహారంలో జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యి బెయిల్‌పై బయటకు వచ్చారు.
అయితే తాజాగా అగ్రిగోల్డ్ భూములను జోగి కుటుంబం విక్రయించినట్టుగా రెవెన్యూ, సీఐడీ, ఏసీబీల సంయుక్త బృందం నిగ్గుతేల్చింది. చట్టబద్ధమైన ఆధారాలు సేకరించింది. దీంతో జోగి రమేష్ కు ఉచ్చు గట్టిగా బిగుసుకుంది. ఈ నేపథ్యంలోనే రేపో మాపో ఆయన అరెస్ట్ అవ్వడం ఖాయమని బలంగా ప్రచారం జరుగుతోంది.