మహానాడు..తెలుగుదేశం పార్టీ నిర్వహించే ఈ మహా ఈవెంట్ ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రత్యేకమే. తెలుగు తమ్ముళ్లు ఎంతో ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పసుపు పండుగకు ఈ సారి ప్రత్యేకమైన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కడప గడపలో తొలిసారిగా మహానాడు కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలోనే మహానాడుకు రావాలంటూ అన్న ఎన్టీఆర్ పిలుపునిస్తున్నట్లుగా రూపొందించిన ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అవును, కడపలో ఈ నెల 27 నుంచి 29 వరకు టీడీపీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి హాజరు కావాలని అన్నగారు స్వయంగా ఆహ్వానిస్తున్నారు. అయితే, రియల్ గా కాకుండా వర్చువల్ గా ఏఐ వీడియో ద్వారా అన్నగారి వాయిస్ ను అనుకరించారు. అన్నగారే స్వయంగా ఆహ్వానిస్తున్నారా అన్న రీతిలో రూపొందిన ఈ వీడియో తెలుగు తమ్ముళ్లలో నయా జోష్ నింపింది.
‘ప్రియమైన నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు నమస్కారం. తెలుగుజాతిని ఏకం చేయడానికి, తెలుగువారిని జాగృతం చేయడానికి నేను ప్రారంభించిన మహానాడు నేడు తెలుగువారి ఐక్యతకు చిహ్నంగా నిలవడం నాకు ఎంతో గర్వంగా ఉంది. 2025 మే 27, 28, 29 తేదీలలో కడప గడ్డపై తొలిసారిగా జరగబోయే మహానాడు వేడుకలకు మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను.. ’ అంటూ రూపొందించిన ఈ ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.