2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 దక్కించుకొని రికార్డు స్థాయిలో విజయ దుందుభి మోగించింది. అయితే, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఇంతటి ఘనవిజయం సాధ్యమైంది అని వైసీపీ అధినేత జగన్ సహా వైసీపీ నేతలంతా నిరాధార ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. 2019లో ఇవే ఈవీఎంలతో వైసీపీ గెలిచిందని, కానీ 2024లో వైసీపీ ఓడిపోయిన సరికి ఈవీఎంలపై అసత్య ఆరోపణలు చేస్తోందని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలపై వైసీపీ ఆరోపణలు అర్థరహితమని పవన్ కొట్టి పారేశారు. ఈవీఎంల విషయాన్ని వారికి అనుకూలంగా మార్చుకొని మాట్లాడడం వైసీపీకి అలవాటైందని పవన్ అన్నారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై తమిళనాడులో నిర్వహించిన సెమినార్ కు పవన్ కళ్యాణ్ హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు సాధ్యమేనని, మనసుంటే మార్గం ఉంటుందని పవన్ అన్నారు. ముందు ప్రారంభిస్తే మార్గంలో వచ్చే అడ్డంకులు అధిగమించే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సమస్యలు లేవని తాను చెప్పడం లేదని, కానీ వాటిని అధిగమించే సత్తా మనకు ఉందని పవన్ అన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ భారత్ ను ముందుకు తీసుకు వెళ్లే సమర్థవంతమైన నాయకుడని, ఆయన నాయకత్వంలో దేశాభివృద్ధి పరుగులు పెడుతోందని పవన్ అన్నారు. గతంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని పవన్ ప్రకటించారు.