2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తొలి `మహానాడు`ను జరుపుకుంటుంది. ఈ మహా పండగ కోసం కడప ముస్తాబయింది. కడప శివారు చర్లోపల్లిలో మహానాడు నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న మహానాడు వేడుకలకు టీడీపీ నేతలు, ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణకు చెందిన ప్రత్యేక వంటకాలతో అతిథ్యం అందించబోతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఈ ఏడాది జరగబోయే మహానాడు మాంసాహారం కూడా వడ్డించనున్నారు
మొదటి రెండు రోజులు రెండు లక్షల మందికి.. అలాగే ఆఖరి రోజు గురువారం మహానాడు ప్రాంగణంలో రెండు లక్షల మందికి, ప్రాంగణం బయట మూడు లక్షల మందికి భోజనాలు అందించేలా రంగం సిద్ధం చేశారు. సుమారు 1700 మంది వంటవారు.. 800 మంది వడ్డించేవారు మహానాడులో పనిచేస్తున్నారు. నిత్యం భోజనాల్లో ఇరవై రకాల వంటకాలకు తగ్గకుండా వడ్డించబోతున్నారు. కడప మహానాడు మెనూ చూస్తూ నోరూరాల్సిందే.
ఉదయం అల్పాహరంలో ఇడ్లీ, పొంగలి, టూటీ ఫ్రూటీ కేసరి, టమాటా బాత్, కాఫీ, టీ అందిస్తున్నారు. మధ్యాహ్నం భోజనంలో శాఖాహారులకు ప్లెయిన్ బిర్యానీ, వైట్ రైస్, టమాటా పప్పు, గోంగూర పూల్ మఖానా, రోటి పచ్చడి, పెరుగు, చిప్స్, బెండకాయ బూందీ, ములక్కాయ టమాటా గ్రేవీ వడ్డించనున్నారు.
మాంసాహార ప్రియులకు ప్లెయిన్ బిర్యానీ, గోంగూర చికెన్, ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ, ఎగ్ రోస్ట్, రోటి పచ్చడి, వైట్ రైస్, సాంబార్, ఉలవచారు, మామిడికాయ పచ్చడి, పెరుగు రుచి చూపించనున్నారు.
సాయంత్రం స్నాక్స్ గా కార్న్ సమోసా, బిస్కెట్లు, పకోడీ, మిర్చి బజ్జీలతో పాటు కాఫీ, టీ అందజేయనున్నారు. ఇక రాత్రి భోజనంలో వైట్ రైస్, వంకాయ బఠాణీ, ఆలూ ఫ్రై, పెసరపప్పు చారు, రోటి పచ్చడి, పెరుగు వడ్డించనున్నారు.