వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంత సైలెంట్ గా ఉందామని ప్రయత్నించిన ఫ్యాన్ పార్టీ మాత్రం ఆయన్ను ఏదో ఒకరకంగా ఇరిటేట్ చేస్తూనే ఉంది. తాజాగా విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడు అనడానికి పక్కా ఆధారాలు ఇవే అంటూ వైసీపీ ఓ సంచలన పోస్ట్ పెట్టింది. మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు హాజరు కావడానికి కొన్ని గంటల ముందు టీడీపీ నేతలతో సాయిరెడ్డి రహస్యంగా సమావేశం అయ్యారని వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్ ను కూడా విడుదల చేసింది.
అయితే వైసీపీ పోస్ట్‌పై సాయిరెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నన్ను కెలికితే జగన్ కే రిస్క్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. `నేను మౌనంగా ఉండడం వైఎస్సార్ సీపీలో కోటరీకి నచ్చడం లేదు. అందుకే నాపై వైఎస్సీపీ సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకడం మరియు ఇరిటేట్ చేయడం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్నవారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు.` అంటూ సాయిరెడ్డి తేల్చి చెప్పారు.
`నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలిపశువును చేద్దాం అని కోటరి నిర్ణయించుకున్నందున, నన్ను అంతకు ముందు నుంచి 4 ఏళ్ళుగా అవమానిస్తున్నందున, లేని అభాండాలు నా నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను. 2011 లో 21 కేసులు పైన వేసుకున్న నేను 2025 లో కూడా జగన్ గారే అడిగి ఉంటే (కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా) సంబంధం లేకున్నా బాధ్యత తీసుకుని ఉందేవాదినేమో. కోటరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు. 3 తరాలుగా అ కుటుంబానికి సేవచేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ గారు పక్కన పెట్టారు. ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? అలా చేయకుంటే వెస్నుపోటు దారుడు అవుతాడా? అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడు పోయిన మనిషి అవుతాడా ?` అంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు.
`అవును. నేను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారి ఇంటికి వెళ్ళా నాకు స్వర్గీయ కృష్ణ గారి కుటుంబానికి రెండు దశాబ్దాల అనుబంధం. అందరూ నా కుమార్తె వివాహానికి వచ్చారు. అదే సమయం లో టీడీ జనార్ధన్, వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. నేను ఈ జన్మకు టీడీపీలో చేరడం లేదని ముందే చెప్పా. కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారినే కలుస్త కానీ వేరే వాళ్ళతో ఎందుకు చర్చిస్తాను. వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు. ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను. లిక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటుంటే, ఆ స్కాం రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిశా అని జగన్ గారి కోటరీ అంటున్నారు. మరి, స్కామ్ లేనప్పుడు, నేను ఏం చర్చిస్తాను. స్కాం గురించి సిట్ విచారణలో ఏ1 గురించి చెప్పానే కానీ వేరే ఎవ్వరిని నేను ప్రస్తావించలేదు.` అంటూ ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి సుధీర్గ పోస్ట్ పెట్టారు.