తెలుగుదేశం పార్టీ అసలైన పండుగ మహానాడు ఈరోజు ఉదయం కడపలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కడప మహానాడులో వైసీపీ ఫీజులు ఎగిరిపోయేలా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రం భవిష్యత్తు కోసం `నా తెలుగు కుటుంబం` పేరుతో ఆరు శాసనాలను ప్రకటించారు. మహానాడు వేదికగా లోకేష్ మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎత్తిన పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే తనకు నిత్య స్ఫూర్తి అన్నారు.
కార్యకర్తలే పార్టీకి బలం, బలగం.. ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీకి ప్రతిపక్షం కొత్త కాదు.. అధికారం కొత్త కాదు.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే నిలబడ్డామని లోకేష్ గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో కూడా మార్పు రావాలని.. మహానాడు వేదికగా మరో నాలుగు దశాబ్దాలు పార్టీ నడవడానికి కావాల్సిన అంశాలపై చర్చించాలని లోకేష్ సూచించారు.
తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ అన్నారు. తెలుగువారు కష్టాల్లో ఉంటే ముందుండి అండంగా నిలబడే పార్టీ, పెదల కడుపు నిండా భోజనం పెట్టే పార్టీ టీడీపీ అన్నారు. పేదరికం లేని సమాజమే టీడీపీ లక్షమన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారు, సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశారు, ఓ మహిళా మంత్రి నాకు చీర, గాజులు పంపారు, అవమానించిన వారి పరిస్థితి ఇప్పుడు ఏమైంది.. అర్థమైందా రాజా? అంటూ ఫ్యాన్ పార్టీకి లోకేష్ మాస్ కౌంటర్ ఇచ్చారు.అలాగే మహానాడు వేదికగా మంత్రి లోకేష్ ఆరు శాసనాలను ప్రకటించారు. వాటికి ఒకసారి పరిశీలిస్తే..
1. తెలుగు జాతి-విశ్వ ఖ్యాతి
2. పేదల సేవలో-సోషల్ రీఇంజినీరింగ్
3. స్త్రీ శక్తి
4. అన్నదాతకు అండగా
5. యువగళం
6. కార్యకర్తే అధినేత
ఈ ఆరు శాసనాలు తప్పకుండా అమలు చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.