తెలుగుదేశం పార్టీ మహా పండుగ అయిన `మహానాడు` ఈ ఏడాది కడప జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ వ్యవస్థాపకుడు, తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం, సినీ రాజకీయ సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి కావడంతో.. రెండో రోజు బుధవారం మహానాడు వేడుకల మరింత ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అయితే ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మహానాడులో కార్యకర్తలకు ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చింది టీడీపీ.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో ఎన్టీఆర్ ప్రసంగిస్తున్న వీడియోను సృష్టించి మహానాడులో ప్రదర్శించింది. `మహా వేడుకలా, నింగి నేలా పసుపుమయమై పరవసించే వేళ అంగరంగ వైభంగా జరుగుతున్న మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్లకు, ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు, దేశవిదేశాల్లో తెలుగు కీర్తి పతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు, వివిధ రంగాలలో తన ప్రజ్ఞ పాఠవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక సాంకేతిక సాహిత్య నిరాజం ఇచ్చిన కళాకారులకు, మేధావులకు, శాస్త్రవేత్తలకు, విజ్ఞులకు ముఖ్యంగా నా పసుపు జెండాను గుండెల మీద మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి` అంటూ సాగిన ఎన్టీఆర్ ఏఐ స్పీచ్ టీడీపీ శ్రేణులను, కార్యకర్తలను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు రాష్ట్రంలో తెచ్చిన పథకాలు, జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ఏఐ ఎన్టీఆర్ ప్రసంగించారు. వీడియోలో చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడం, `భళా మనవడా.. భళా..` అంటూ లోకేష్ ను ఉద్దేశించి ఏఐ ఎన్టీఆర్ మాట్లాడటం మరో హైలెట్. మొత్తంగా ఎన్టీఆర్ ఏఐ స్పీచ్ గూస్‌బంప్స్ తెప్పిస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.