త్వరలో విడుదలకు సిద్దమవుతున్న కన్నప్ప చిత్రానికి భారీ షాక్ తగిలింది. ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ వైనం ఇప్పుడా చిత్రయూనిట్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంటి దొంగ దెబ్బకు కన్నప్ప నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి. ప్రస్తుతం తమకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నప్ప చిత్రాన్ని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం మీద మంచు విష్ణు అండ్ కో భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కీలక కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ను ముంబయిలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ వారు డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిల్ం నగర్ లోని చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్యాలయానికి పంపారు.
కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్ కుమార్ ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ హార్డ్ డిస్క్ పార్మిల్ అతని ఆఫీసుకు వచ్చింది. పార్మిల్ ను ఆఫీస్ బాయ్రఘు తీసుకున్నాడు. అతను ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా హార్డ్ డ్రైవ్ ను చరిత అనే మహిళకు అప్పగించాడు. అప్పటి నుంచి వీరిద్దరూ తప్పించుకు తిరుగుతున్నారు.
ఈ విషయాన్ని గుర్తించిన విజయ్ కుమార్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి దొంగల పనికి ఇప్పుడు చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు వీరిద్దరి కోసం గాలిస్తున్నారు. వీరి వెనుక ఎవరు ఉన్నారు? ఏ ఉద్దేశంతో ఈ పని చేశారు? లాంటి అంశాలపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.