టాలీవుడ్ పెద్దల తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇండస్ట్రీలో బాగానే కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. ఆల్రెడీ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. పవన్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఆయన సంధించిన ప్రశ్నలు సమంజసమే అన్నారు. తాను వివాదాల్లో ఎంతమాత్రం భాగం కాదని తేల్చేశారు. ఇప్పుడిక దిల్ రాజు వంతు వచ్చింది.
థియేటర్ల స్ట్రైక్ వెనుక రాజు ఉన్నాడని కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్లో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ నిర్ణయానికి, తనకు సంబంధమే లేదని.. దీనికి సంబంధించిన మీటింగ్ జరిగినపుడు తాను ఇండియాలోనే లేనని.. కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లానని ఆయన స్పష్టం చేశారు. నిజానికి ఎగ్జిబిటర్ల సమస్యల గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోందని.. ఇటీవల జరిగిన మీటింగ్‌లో తమ డిమాండ్లు నెరవేర్చకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తామని వాళ్లు అన్నారని.. ఈ మేరకు నిర్మాతల మండలికి లేఖ ఇస్తే.. అదేమో నిజంగా స్ట్రైక్ చేసేస్తున్నట్లుగా మీడియాలోకి వెళ్లిందని రాజు చెప్పారు.
తాను తర్వాత ఎగ్జిబిటర్లను కలిసినపుడు.. సమస్యల గురించి చెప్పడం ఓకే కానీ.. థియేటర్లు మూసేస్తామని అనడం తప్పు అని చెప్పానని.. దీని వల్ల సాధించేదేమీ లేదని స్పష్టం చేశానని అన్నారు రాజు. ఇక ఇండస్ట్రీ తరఫున ప్రతినిధులు వెళ్లి ఏపీ ముఖ్యమంత్రిని కలవకపోవడం గురించి రాజు స్పందించారు. ఎవరికి వాళ్లు తమ సినిమా వచ్చినపుడు వెళ్లి కలుస్తున్నామని.. తర్వాత సైలెంట్ అయిపోతున్నామని.. అందరం కలిసి వెళ్లి సీఎంను కలుద్దామని అనుకోలేదని.. తమలో ఐకమత్యం లేని మాట వాస్తవమని.. అదే సమస్య అని రాజు అన్నారు. తమలో ఐకమత్యం ఉంటే.. తాను, అరవింద్, మిగతా పెద్దలు కలిసి ప్రెస్ మీట్ పెట్టేవాళ్లమని.. అది లేదు కాబట్టి తాము విడివిడిగా ప్రెస్ మీట్లు పెడుతున్నామని రాజు వ్యాఖ్యానించడం విశేషం.