గత దశాబ్ద కాలంలో దక్షిణాది నుంచి మేటి నటుడిగా ఎదిగిన వ్యక్తి.. విజయ్ సేతుపతి. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు పాపులారిటీ ఉంది. ఒక ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోకుండా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా భిన్న పాత్రలు చేస్తుంటాడు సేతుపతి. ఈ మోస్ట్ వాంటెడ్ నటుడు ఇప్పుడు పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి కూడా ఇప్పుడు హీరో అయిపోయాడు. అతను లీడ్ రోల్ చేసిన ‘ఫోనిక్స్’ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. రివ్యూలు కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. సూర్య సేతుపతిని చూస్తే హీరో లుక్స్ కనిపించవు కానీ.. మంచి నటుడిగా మాత్రం పేరు సంపాదించాడు. ఇంతకుముందు విజయ్ సేతుపతి హీరోగా నటించిన నానుమ్ రౌడీ దా, విడుదల-2 చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసిన అతడికి హీరోగా ‘ఫోనిక్స్’ తొలి సినిమా. వరలక్ష్మి శరత్ కుమార్ ఇందులో కీలక పాత్ర చేసింది. ఆమెతో పోటీ పడి నటించి ఆకట్టుకున్నాడు సూర్య.
ఐతే తొలి సినిమా రిలీజ్ టైంలో ఒక వివాదం సూర్యను అనవసరంగా వార్తల్లో నిలబెట్టింది. ఈ సినిమా ప్రిమియర్ షో సందర్భంగా అభిమానులతో మాట్లాడుతూ.. సూర్య యాటిట్యూడ్ చూపించాడన్నది అతడి మీద వచ్చిన ఆరోపణ. ఆ టైంలో నోట్లో చూయింగ్ గమ్ వేసుకుని నములుతూ కనిపించాడు సూర్య. మీడియా కెమెరాలు తన మీద ఫోకస్ చేసి ఉండగా, ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ.. చూయింగ్ గమ్ నములుతూ యాటిట్యూడ్ చూపించడమేంటి అంటూ సోషల్ మీడియాలో అతడి మీద విమర్శల దాడి మొదలైంది. దీనిపై ట్రోలింగ్ జరుగుతుండడంతో విజయ్ సేతుపతి స్పందించాడు. తన కొడుకు ఉద్దేశపూర్వకంగా ఇది చేయలేదని.. తెలియకుండా జరిగిన తప్పు ఇదని.. ఇందుకు తాను క్షమాపణ చెబుతున్నానని సేతుపతి పేర్కొన్నాడు.