ఇటీవల కాలంలో చాట్ జీపీటీ వినియోగం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది వివిధ రంగాల్లో ఉపయోగపడే ఒక శక్తివంతమైన మల్టీటాస్కింగ్ టూల్ గా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి పరిష్కరించలేని ఎన్నో సమస్యలను చాట్ జీపీటీ సాల్వ్ చేస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది. తాజాగా 10 ఏళ్ల మెడికల్ మిస్టరీని చేధించి మరోసారి చాట్ జీపీటీ తన సత్తా ఏంటో నిరూపించకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల నుంచి ఓ వ్యక్తి రోగమేంటో గుర్తించలేక డాక్టర్లే చేతులెత్తేస్తే.. చాట్ జీపీటీ మాత్రం చిటికెలో అతని సమస్యేంటో గుర్తించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
చాట్ జీపీటీ ఛేదించిన పదేళ్ల తన మెడికల్ మిస్టరీని ఓ వ్యక్తి తన రెడ్డిట్ ఖాతాలో పంచుకున్నారు. అతను పదేళ్లకు పైగా నుంచి మానసిక, శారీరకంగా వివరించలేని లక్షణాలతో బాధపడుతున్నాడు. ఎంఆర్ఐ, సిటి స్కాన్, బ్లడ్ టెస్టులు, లైమ్ వ్యాధి పరీక్షలు ఇలా ఎన్ని టెస్టులు చేసినా సమస్య ఏంటో వైద్యులు గుర్తించలేకపోయారు. దేశంలోని ప్రఖ్యాత హెల్త్ కేర్ సంస్థల్లో చికిత్స తీసుకున్నప్పటకీ, న్యూరాలజిస్ట్‌తో సహా అనేక మంది వైద్య నిపుణులను సంప్రదించినప్పటికీ స్పష్టమైన రోగ నిర్ధారణ జరగలేదని సదరు వ్యక్తి పేర్కొన్నాడు.
చివరకు ఒక రోజు ఆ వ్యక్తి చాట్ జీపీటీని ఆశ్రయించాడు. తన మెడికల్ రిపోర్ట్స్ అని అందించగా.. చాట్ జీపీటీ అతనికి ‘హోమోజైగస్ A1298C ఎమ్టీహెచ్ఎఫ్ఆర్ మ్యూటేషన్’ సమస్య ఉందని తేల్చింది. బి12లోపం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ప్రపంచ జనాభాలో 7-12% మందిలో ఇది కనిపిస్తుంది. సాధారణ బి12 లెవెల్స్ ఉన్నా.. శరీరం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతోంది. కాబట్టి బి12ను సప్లిమెంటేషన్‌తో పెంచాలని చాట్ జీపీటీ సూచించింది. దాంతో సదరు వ్యక్తి ఇదే విషయాన్ని వైద్యులకు చెప్పగా.. అందుకు తగ్గట్లే వారు కూడా చికిత్స చేశారు. అనూహ్యంగా కొద్ది రోజుల్లోనే నా సమస్య చాలా వరకు తగ్గిందని.. నా హెల్త్ కండీషన్ మెరుగుపడటంతో వైద్యులు కూడా షాక్ అయ్యారని సదరు వ్యక్తి పేర్కొన్నారు. దీంతో ఇప్పుడీ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.