`సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో బిగ్ హిట్ అందుకుని ఈ ఏడాదిని గ్రాండ్ గా ప్రారంభించిన విక్టరీ వెంకటేష్.. తాజాగా తన క్రేజీ లైనప్ ని రివీల్ చేశారు. అమెరికాలో జరిగిన `నాట్స్ 2025` లో సందడి చేసిన వెంకీ.. తన రాబోయే చిత్రాల గురించి ఓపెన్ అయ్యారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నానని వెల్లడించి అటువంటి నందమూరి, ఇటు మెగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేశారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని వెంకీ మామ వెల్లడించారు. అలాగే అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న `మెగా 157`లో అతిథి పాత్రలో నటిస్తున్నానని.. తన పాత్ర చాలా ఫన్నీగా, ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని వెంకీ పేర్కొన్నారు.
థ్రిల్లర్ ఫ్రాంచైజీ `దృశ్యం 3` కూడా లైన్ లోనే ఉంది.. మరోసారి మీనాతో కలిసి ఈ చిత్రంలో యాక్ట్ చేయబోతున్నానని వెంకటేష్ తెలిపారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తన నాలుగో సినిమా చేయబోతున్నట్లు వెంకీ ప్రకటించారు. చూచాయిగా అది `సంక్రాంతి వస్తున్నాం` సినిమాకు సీక్వెల్ అని కూడా చెప్పేశారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే... ఇంతవరకు ఎవరికీ తెలియని మరో బిగ్ న్యూస్ ను ఆయన రివీల్ చేశారు. తన స్నేహితుడు నందమూరి బాలకృష్ణతో కలిసి త్వరలోనే ఓ బిగ్ ప్రాజెక్ట్ లో నటించబోతున్నానని వెంకీమామ వెల్లడించారు. ఇక ఈయన క్రేజీ లైనప్ చూసి అటు దగ్గుబాటి ఫ్యాన్స్ తో పాటు ఇటు మెగా, నందమూరి ఫ్యాన్స్ కూడా తెగ మురిసిపోతున్నారు.