ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76 వ జయంతి నేడు. ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ఆర్ అటు అభివృద్ధికి ఇటు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. రైతుల నుంచి వృద్ధుల వరకు ప్రతి వర్గానికి ఉపయోగపడేలా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. రైతులకు గుండెచప్పుడు అయ్యారు. మానవతా నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్రను పోషించారు.
అటువంటి మహానేతను స్మరించుకునేందుకు తెలంగాణలో సరైన వేదిక లేకపోవడం బాధాకరం. ఎన్టీఆర్ కు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ ఉంది. ఆయన వర్ధంతి, జయంతిలకు కుటుంబ సభ్యులు, అభిమానులు ఆ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పిస్తుంటారు. కానీ రాజశేఖర్ రెడ్డికి అటువంటిదేమీ లేదు. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. ఏపీలో జగన్ అధికారంలో ఉన్నారు. కేసీఆర్ తో మంచి సంబంధాలే ఉన్న జగన్ మాత్రం తండ్రి స్మారకార్థం ఒక ఘాట్ కానీ.. స్మారక వేదిక గాని నిర్మించాలన్న ఆలోచన చేయలేదు.
అయితే ఇప్పుడా ఆలోచన జగన్ సోదరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు వచ్చింది. నేడు వైఎస్ఆర్ జన్మస్థలమైన పులివెందులలో తండ్రికి ఘనంగా నివాళులర్పించిన షర్మిల.. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి కీలక విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో కూడా రాజశేఖర్ రెడ్డి గారికి ఒక మెమోరియల్ ఘాట్ ఉండాలన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీ అది కేటాయించినప్పటికీ ఇంతవరకు అమలు కాలేదన్నారు. తెలంగాణలో కనీసం జయంతికి, వర్ధంతికి రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన అభిమానులు స్మరించుకునేందుకు మరియు నివాళులు అర్పించేందుకు ఎటువంటి మెమోరియల్ స్పేస్ లేదు..
ఇప్పటికైనా వైఎస్ఆర్ జ్ఞాపకార్థం హైదరాబాద్ తో స్మృతివనం ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ విషయం ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖలు కూడా రాశాను అంటూ మీడియా ఎదుట షర్మిల పేర్కొన్నారు.