దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో హాలీవుడ్లో వచ్చిన గుర్తింపుతో అక్కడి వాళ్లను కూడా తన సినిమా కోసం ఎదురు చూసేలా చేశాడు జక్కన్న.
ఈ సినిమా చిత్రీకరణ మొదలై దాదాపు ఆరు నెలలు కావస్తుండగా.. సినిమా నుంచి ఇప్పటిదాకా అధికారికంగా ఏ విశేషం బయటికి రాలేదు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ థ్రిల్లర్ ఇదని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇండియాలో రెండు షెడ్యూళ్ల తర్వాత ఆఫ్రికాలో చిత్రీకరణకు సన్నాహాలు చేసుకుంది చిత్ర బృందం. ఐతే అక్కడ ప్లాన్ చేసుకున్న పెద్ద షెడ్యూల్‌కు ఇప్పుడు బ్రేక్ పడిందని సమాచారం.
కెన్యాలోని అటవీ ప్రాంతాల్ల ో జరగాల్సిన ఈ సినిమా షెడ్యూల్ ఆగిపోయిందట. కెన్యాలో ప్రస్తుతం శాంతి భద్రతల సమస్య తలెత్తింది. దీంతో పర్యాటకుల మీదే కాక షూటింగ్స్ చేసే వాళ్లకూ ఆంక్షలు తప్పట్లేదు. దీంతో రాజమౌళి సినిమాకు సైతం ఇబ్బందులు తప్పట్లేదు. ఈ సినిమా మెజారిటీ ఎపిసోడ్లను ఆఫ్రికాలోనే చిత్రీకరించాల్సి ఉంది. కొన్ని నెలల పాటు లొకేషన్ల వేట జరిపి కెన్యాలో చిత్రీకరణ జరపడానికి ప్లాన్ చేసింది రాజమౌళి టీం. కానీ ఇప్పుడు ఊహించని ఆటంకం ఎదురుకావడంతో ప్రత్యమ్నాయాలు చూడాల్సి వస్తోంది.
ఇప్పటికప్పుడు మార్పు అంటే.. దాని వల్ల షెడ్యూళ్లు దెబ్బ తినడం ఖాయం. ఇది చిత్ర బృందానికి తీవ్ర ఇబ్బంది కలిగించే విషయమే. దేశవిదేశాలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్ల కాల్ షీట్లను సర్దుబాటు చేసి చిత్రీకరణ జరపడంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మరి జక్కన్న టీం ఈ ఇబ్బందిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.. ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు నాడు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.