2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తమ సొంత ఖర్చులు పెట్టుకొని మరీ ఎన్నారైలు టీడీపీ, జనసేన, బీజేపీలకు ఓటేసేందుకు పోటెత్తారు. ఈ క్రమంలోనే ఎన్నారైల కోసం అమరావతిలో ఐకాన్ టవర్ ను నిర్మిస్తోంది ఏపీ ప్రభుత్వం. అమరావతి నిర్మాణంలో, పీ4 కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఎన్నారైలకు ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ప్రవాసాంధ్రులకు ఏపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై, ఎన్నారైల సాధికారిత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఏపీఎన్నార్టీఎస్ ద్వారా ఎన్ఆర్ఐల సంక్షేమం, భద్రత, అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు. ఏపీఎన్నార్టీఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల, సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలానికి చెందిన భవనాసి సత్య బాబు మరణించారు. వారి కుటుంబానికి “ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం” కింద రూ.10 లక్షల పరిహారాన్ని సత్యబాబు కుటుంబ సభ్యులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అందించారు. విదేశాలకు వలస వెళ్ళిన ప్రవాసాంధ్రులకు అన్ని విధాల సహకారం అందించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రవాసాంధ్ర భరోసా పథకంలో విదేశాలలో పనిచేస్తున్న ప్రవాసాంధ్రులు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు.
ప్రవాసాంధ్ర భరోసా బీమా కింద సత్యబాబు నమోదు చేసుకున్నారని, కాబట్టే సాయం కోసం ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ ను ఆయన కుటుంబ సభ్యులు సంప్రదించి సాయం పొందారని అన్నారు. ఈ బీమా ఆ కుటుంబానికి అందడంలో కీలక పాత్ర వహించిన ఏపీ ఎన్నార్టీఎస్,యు న్యూ ఇండియా అస్యురెన్స్ కంపెనీకి సత్యబాబు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎన్ఆర్టీఎస్ సీఈవో, ఏపీ ఎన్నార్టీఎస్ డైరెక్టర్ కానూరి శేషుబాబు కానూరి, ఎన్నారై టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు శ్రీ రావి రాధాకృష్ణ, ఎన్నారై టీడీపీ కువైట్ విభాగం అధ్యక్షుడు శ్రీ నాగేంద్ర బాబు అక్కిలి, ఎన్నారై టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని, ఏపీ ఎన్ఆర్టీఎస్ మాజీ డైరెక్టర్ రాజశేఖర్ చప్పిడి, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ విజయవాడ డివిజనల్ మేనేజర్ కె.జోసెఫ్ పాల్గొన్నారు.