ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో పూర్తిగా దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని చంద్రబాబు తన బ్రాండ్ తో మళ్లీ ట్రాక్ లో పెడుతున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న మంత్రి లోకేశ్ ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పెట్టుబడుల కోసం బెంగుళూరులో పర్యటించారు లోకేశ్. తాజాగా ఆ పర్యటన విజయవంతమై ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ రియాలిటీ సంస్థ సత్వా గ్రూప్ ముందుకు వచ్చింది.
ఆ గ్రూప్ ప్రతినిధులతో లోకేశ్ చర్చలు జరిపిన కొద్ది గంటల్లోనే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ రెడీ అయింది. విశాఖ నగరంలో 30 ఎకరాల విస్తీర్ణంలో సత్వా వాంటేజ్ మిక్స్డ్ డెవలప్ మెంట్ క్యాంపస్ ను రూ.1500 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తద్వారా ప్రత్యక్షంగా 25 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
ఈ ప్రాజెక్టులో గ్లోబల్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా గ్రేడ్–ఏ ఆఫీసులు, ప్రీమియం రెసిడెన్షియల్ యూనిట్లు, స్టార్ట్ అర్బన్ సదుపాయాలు ఏర్పాటు చేయబోతున్నారు. సాగరతీరంలో ఏపీ ఆర్థిక రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విశాక సిగలో సత్వా క్యాంపస్ మరో కలికితురాయి కానుంది. బెంగుళూరు పర్యటనలోనే ఏఎన్ఎస్ఆర్ సంస్థ విశాఖలో 10వేల ఉద్యోగాలు కల్పించే జిసిసి ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. లోకేశ్ టూర్ వల్ల విశాఖలో రెండు కంపెనీల ద్వారా 35 వేలమందికి ఉద్యోగ అవకాశాలు దక్కాయి.