టాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ సంపాదించి, పెద్ద రేంజికి ఎదిగిన అతి కొద్దిమంది హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ట్యాక్సీవాలా సక్సెస్‌లతో ఒక దశలో అతను స్టార్ నుంచి ‘సూపర్ స్టార్’ రేంజికి ఎదుగుతున్నట్లు కనిపించాడు. కానీ తర్వాత తన డౌన్ ఫాల్ మొదలైంది. వరుస డిజాస్టర్లతో ఇబ్బందులు పడ్డాడు. అయినా సరే ఇప్పటికీ విజయ్ క్రేజ్ తక్కువేమీ కాదు.
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించడం చిన్న విషయమేమీ కాదు. ఐతే ఎంత స్టార్ ఇమేజ్ సంపాదించినప్పటికీ.. బ్యాగ్రౌండ్, సపోర్ట్ సిస్టం ఉన్న వాళ్లకు ఉన్న కొన్ని లగ్జరీలు తనకు లేవని అంటున్నాడు విజయ్. తన కొత్త చిత్రం ‘కింగ్‌డమ్’ రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయమై అతను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఒక సినిమా సెట్స్ మీదికి వెళ్లే సమయంలో.. ఈ కథ మీద ఇంకా వర్క్ చేయాలి, ఇంకొన్ని రోజులు ఆగుదాం అని చెప్పే లగ్జరీ తనకు లేదని విజయ్ తెలిపాడు. బ్యాగ్రౌండ్ ఉన్న హీరోల విషయంలో దీనికి భిన్నంగా జరుగుతుందని చెప్పాడు విజయ్. ఆ హీరో తండ్రో, మరొకరో వచ్చి ఈ కథ మీద ఇంకా పని చేస్తే బాగుంటుంది, ఇద్దరు ముగ్గురు రైటర్లను ఇస్తాను.. స్క్రిప్టు మరింత డెవలప్ చేశాక సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్దాం అని చెబుతారని.. ఆ లగ్జరీ తనకు లేదని, దర్శకుడు ఎప్పుడంటే అప్పుడు సినిమాను మొదలుపెట్టాల్సిందే అని విజయ్ చెప్పాడు.
తద్వారా బ్యాగ్రౌండ్ లేకపోతే స్క్రిప్టు మీద పూర్తి సంతృప్తిగా లేకపోయినా కొన్ని సినిమాలు చేయక తప్పదనే అర్థం వచ్చేలా విజయ్ మాట్లాడాడు. మరోవైపు తన పేరు వెనుక ‘ది’ అని పెట్టి, తర్వాత తీసేయడం గురించీ విజయ్ స్పందించాడు. టాలీవుడ్లో ట్యాగ్స్ లేని హీరోలు లేరని.. తన తర్వాత వచ్చిన హీరోలకు కూడా ట్యాగ్స్ ఉన్నాయని.. కానీ తన పేరు ముందు ‘ది’ పెట్టుకుంటే మాత్రం తీవ్రమైన విమర్శలు వచ్చాయని విజయ్ అన్నాడు.
సౌత్ సెన్సేషన్, రౌడీ స్టార్ అంటూ మీడియా పెట్టిన ట్యాగ్స్ నచ్చక.. ‘లైగర్’ రిలీజ్ టైంలో తన టీం ‘ది’ అని సూచిస్తే ఓకే చెప్పానని.. కానీ తర్వాత వచ్చిన నెగెటివిటీ చూశాక దాన్ని తీసేయమని టీంకు చెప్పానని విజయ్ వెల్లడించాడు.