టాలీవుడ్లో రాబోయే కొన్ని వారాల్లో క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సందర్భంగా థియేటర్లు కళకళలాడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 24న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రాబోతోంది. పవన్ సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర సందడి బాగానే ఉంటుంది. తర్వాతి వారం విజయ్ దేవరకొండ చిత్రం ‘కింగ్‌డమ్’ కూడా మంచి హైప్ మధ్యే రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత రెండు వారాలకు బాక్సాఫీస్‌ను షేక్ చేసే రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి.
అవే.. వార్-2, కూలీ. రజినీకాంత్ గత చిత్రాలతో పోలిస్తే ‘కూలీ’కి ఉన్న హైపే వేరు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి హిందీలో నటించిన ‘వార్-2’కు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజే ఉంది. ఈ చిత్రాన్ని తారక్ అభిమాని, తనకు అత్యంత సన్నిహితుడు అయిన సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేస్తుండడంతో అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.
ఇంతకుముందు ‘దేవర’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన నాగవంశీ.. ఆ సినిమాకు చేసిన రిలీజ్ ప్లానింగ్ అభిమానులకు ఎంతో నచ్చింది. ‘వార్-2’కు కూడా అదే ప్లానింగ్‌తో వంశీ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 500 స్పెషల్ ప్రిమియర్స్ ప్లాన్ చేస్తున్నాడట నాగవంశీ. ఏపీలో మిడ్ నైట్ షోలకు కూడా అనుమతులు తెచ్చుకోవచ్చు. అక్కడ ‘దేవర’కు వేసినట్లే అర్ధరాత్రి 1 గంట షోలు వేయాలనుకుంటున్నారు. అన్ని మేజర్ సిటీస్‌లో ‘దేవర’ సినిమా రిలీజయ్యే ప్రతి థియేటర్లో మిడ్ నైట్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
తెలంగాణలో ‘పుష్ప-2’ తర్వాత మిడ్ నైట్, తెల్లవారుజామున షోలు రద్దు చేశారు. ‘వార్-2’కు వీలైనంత త్వరగా ఇక్కడ షోలు వేయాలని చూస్తున్నారు. ఉదయం 6 గంటలకు అయినా షోలు మొదలుపెట్టాలన్నది ప్లాన్. ఇంకా ముందు షోలు మొదలుపెట్టడానికి అవకాశముందా అని కూడా చూస్తున్నారు. ఏపీలో అదనపు రేట్లు రావడం కూడా లాంఛనమే. తెలంగాణలో మాత్రం నార్మల్ రేట్లతోనే సినిమా రిలీజ్ కానుంది.