తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితులైన సంగతి తెలిసిందే. నీతి నిజాయితీ రాజకీయాలకు అశోక్ గజపతిరాజు కేరాఫ్ అడ్రస్. సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ఎటువంటి మచ్చ లేని మనిషి. ఆయన సేవలను గుర్తించిన చంద్రబాబు ఏకంగా గోవా గవర్నర్ అయ్యేందుకు సహకారం అందించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ హోంమంత్రి వంగలపూడి అనిత.. చంద్రబాబుకి, జగన్‌కి మధ్య ఉన్న తేడాను వివరించారు.
తాజాగా హోంమంత్రి అనిత గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్ గజపతిరాజును కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. విజయనగరంలోని వారి కోటలో గజపతిరాజును సత్కరించారు. సుమారు 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చ లేని నాయకుడిగా నిలిచిన రాజు గారికి గవర్నర్ పదవి దక్కడం తెలుగు వారికి గర్వకారణమని ఈ సందర్భంగా అనిత అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తికైనా ఏదో ఒక మచ్చ ఉంటుంది కానీ అశోక్ గజపతి రాజు కడిగిన ముత్యమని అనిత ప్రశంసలు కురిపించారు.
ఐదు దశాబ్దాల నుంచి విజయనగరం జిల్లాకు అశోక గజపతిరాజు ఎన్నో సేవలు అందించారని.. సమాజానికి ఇంకా ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో తన కుమార్తెను కూడా పాలిటిక్స్ లోకి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారని అనిత చెప్పుకోచ్చారు. విలువులకు మారుపేరైన ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవాల్సింది పోయి.. గత వైసీపీ ప్రభుత్వం రాజు గారిని, ఆయన కుటుంబసభ్యులను అనేక ఇబ్బందులకు గురిచేశారని అనిత మండిపడ్డారు.
రాత్రి పగలు అనే తేడా లేకుండా కక్షలు కడుతూ కేసులు పెట్టేవారు. యుద్ధానికి కూడా ఒక టైమ్ ఉంటుంది. కానీ జగన్ చేసే యుద్ధానికి టైమే ఉండదు. జగన్ కక్షలు కడితే.. చంద్రబాబు ఆయన సేవలను గుర్తించి గౌరవించారు. అదే జగన్‌కి, చంద్రబాబుకి ఉన్న తేడా.. ఇకనైనా సమాజానికి ఉపయోగపడే విధంగా రాజకీయాలు చేయాలంటూ విపక్షానికి అనిత చురకలు వేశారు.