పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు బయ్యర్ల సమస్య రావడం, బిజినెస్ ఆశించిన స్థాయిలో జరక్కపోవడం అన్నది అరుదైన విషయం. ఆయన స్టార్ ఇమేజ్ సంపాదించాక దాదాపుగా ఏ సినిమాకూ ఈ సమస్య రాలేదు. కానీ ‘హరిహర వీరమల్లు పరిస్థితి’ వేరు. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా విపరీతంగా ఆలస్యం అయింది. దర్శకుడు మారాడు. రిలీజ్ డేట్లు మూడుసార్లు మారాయి. ఈ ఆలస్యం వల్ల సినిమాకు బజ్ తగ్గింది. మరోవైపేమో బడ్జెట్ అనుకున్న దాని కంటే రెట్టింపు అయింది.
పెట్టిన ఖర్చును వెనక్కి తెచ్చుకోవాలని నిర్మాత ఆశించడంలో తప్పు లేదు. కానీ అసలే ప్రస్తుతం థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు, సినిమాలకు లాంగ్ రన్ ఉండట్లేదు. అలాంటపుడు అంతంత రేట్లు పెట్టి సినిమాను కొంటే.. ఏదైనా తేడా వస్తే తాము మునిగిపోతామన్నది బయ్యర్ల భయం. వాళ్ల వెర్షన్ కూడా కరెక్టే. ఈ నేపథ్యంలోనే రిలీజ్ దగ్గర పడుతున్నా కొన్ని ఏరియాల్లో బిజినెస్ ఒక కొలిక్కి రాలేదు.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన నైజాం ఏరియాలో పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఉన్నా.. ‘హరిహర వీరమల్లు’ విషయంలో రిస్క్ చేయలేదు. ఈ పరిస్థితుల్లో నిర్మాత ఏఎం రత్నమే సొంతంగా రిలీజ్ చేసుకోవడానికి రెడీ అయినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అది అంత మంచి ఆలోచన కాదని వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ‘హరిహర వీరమల్లు’ను బయటపడేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రిస్క్ అయినా సరే.. పవన్‌తో ఉన్న సంబంధాల దృష్ట్యా సినిమాను కొనడానికి ఆ సంస్థ రంగంలోకి దిగిందట.
నిర్మాత కోరినంత కాకుండా, మిగతా వాళ్లు అడిగినట్లు మరీ తక్కువకు కాకుండా మధ్యలో ఒక రేటు ఫిక్స్ చేసేలా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాతో తాము ఏమైనా దెబ్బ తిన్నా పర్వాలేదని.. పవన్ సినిమాకు సాయం చేయాలని మైత్రీ అధినేతలు భావించే ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మైత్రీలో పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కూడా చేస్తున్నాడు. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థ రిస్కుకు రెడీ అయింది. ఒకట్రెండు రోజుల్లో చర్చలు కొలిక్కి వచ్చి నైజాంలో ‘వీరమల్లు’ను మైత్రీ సంస్థ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.