తమిళ స్టార్ యాక్టర్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల ఇటీవల తెరకెక్కించిన `కుబేర` చిత్రం ఎంత పెద్ద విషయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అపర కోటీశ్వరుడికి, ఒక బిచ్చగాడికి మధ్య సాగే ఎమోషనల్ డ్రామా ఇది. ఈ మూవీలో బ్లాక్ మనీని వైట్ గా మార్చడం కోసం బిచ్చగాళ్ళ పేరిట విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, ఫేక్ కంపెనీలు సృష్టించి భారీ కుంభకోణానికి పాల్పడతారు. అయితే రియల్ లైఫ్ లోనూ కుబేర సీన్ రిపీట్ అయింది. ఏపీలో యాక్సిస్ బ్యాంకులో భారీ స్కామ్ చోటుచేసుకుంది. కొందరు కేటుగాళ్లు నిరుపేదలను సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా చూపించి ఏకంగా రూ. 10.60 కోట్లు దోచేశారు. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..
నెల్లూరు నగరంలోని యాక్సిస్ బ్యాంకులో కేటుగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుపేదలకు లోన్లు ఇప్పిస్తామని ఆశ చూపించి వారి ఆధార్ కార్డులు, సంతకాలు, వేలిముద్రలను తీసుకున్నారు. ఫేక్ కంపెనీలను సృష్టించారు. ఆ ఫేక్ కంపెనీల్లో దాదాపు 56 మందిని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా చూపుతూ రూ. 10.60 కోట్ల వరకు లోన్లు తీసుకున్నారు.
నెలలు గడుస్తున్న లోన్లు కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు నిరుపేదలకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు చూసి వారు ఖంగుతిన్నారు. ఈ క్రమంలోనే బ్యాంకులో జరిగిన భారీ స్కామ్ బయటపడింది. ఆరు నెలల క్రితం బ్యాంకు మేనేజర్ ముత్తుకూరు పీసీలో ఫిర్యాదు చేశారు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై కేసు నమోదు చేసిన ముత్తుకూరు పోలీసులు.. లోతుగా విచారణ చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.