ఇటీవల కృష్ణాజిల్లా పామర్రులో జరిగిన పార్టీ సమావేశంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని `రప్పా.. రప్పా..` అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కార్యకర్తలు ఉద్దేశిస్తూ `రప్పా రప్పా ఏంట్రా.. చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి. చెప్పి కాదు చెప్పకుండా నరికేయాలి` అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పేర్ని నానిని చిక్కుల్లో పడేశాయి. హింసను ప్రేరేపించేలా నాని వ్యాఖ్యలు ఉన్నాయని అధికార పక్ష నేతలు భగ్గుమన్నాయి.
రప్పా రప్పా అంటూ విద్వేషకర వ్యాఖ్యలు చేసిన పేర్ని నానిపై ఇప్పటికే పామర్రు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లలో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ పరిణమాల నడుమ అరెస్ట్ భయంతో పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. పామర్రు పీఎస్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని.. తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.
అయితే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నానికి షాకిచ్చింది. నాని విజ్ఞప్తిని తోసిపుచ్చి తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఇక అరెస్ట్ నుంచి రక్షణ లభించకపోవడంతో కంగుతిన్న పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనెక్కడ ఉన్నారు అన్నది అనుచరులకు కూడా తెలియడం లేదట. ప్రస్తుతం పేర్ని నాని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని సమాచారం. కాగా, ఈ నెల 22న హైకోర్టు పేర్ని నాని పిటిషన్ పై విచారణ జరిగనుంది. విచారణ తరువాతే పేర్ని నాని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.