వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేష్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. రప్పా-రప్పా అంటూ.. సామాన్యులపై ప్రతాపం చూపిస్తే.. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తేల్చి చెప్పారు. ``రప్పా-రప్పా అంటే.. పోలీసులు రఫ్ఫాడిస్తారు.. బ్రో!`` అంటూ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ఓ ఘటనను ప్రస్తావించిన మంత్రి లోకేష్.. ఈ విషయంలో పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటారని చెప్పారు. చూస్తూ ఊరుకుంటారని ఎవరూ అనుకోవద్దని తేల్చి చెప్పారు.
ఏం జరిగింది?
తిరుపతిలో తిరుమల శ్రీవారి భక్తుల కోసం నిర్మించిన.. శ్రీనివాసం వసతి గృహ సముదాయం ఎదురుగా ఓ చిన్న దుకాణం ఏర్పాటు చేసుకున్నారు టీడీపీ అనుచరుడు. అయితే.. దీనిని తమకు ఇచ్చేయాలని పేర్కొంటూ.. సదరు వ్యాపారిపై వైసీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అనుచరులు.. అనిల్ రెడ్డి, పవన్ అనే వ్యక్తులు దౌర్జన్యం చేశారు. సదరు వ్యాపారికి వారికి ఎదురు తిరగడంతో అతనిని బలవంతంగా తీసుకువెళ్లి ఓ ఇంట్లో నిర్బంధించి.. హింసించారు.
దీనికి సంబంధించిన వీడియోలు తాజాగా వెలుగు చూశాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఈ విషయంలో ఎవరున్నా వదిలి పెట్టవద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో గంటల వ్యవధిలోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ.. మంత్రినారా లోకేష్.. వైసీపీ నేతలకు ఘాటు హెచ్చరిక చేశారు. రప్పా-రప్పా అంటే.. చూస్తూ ఊరుకునేది లేదని.. పోలీసులు రఫ్ఫాడిస్తారని ఆయన హెచ్చరించారు.
వైసీపీ నేతలకు అధికారం పోయినా.. అహంకారం, దౌర్జన్యం మాత్రం పోలేదని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డుపై దౌర్జన్యంగా హింసించారని.. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ను చంపి.. శవాన్ని డోర్ డెలివరీ చేశారని.. గతం గుర్తు చేశారు. అయితే.. ఇప్పుడు ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమని.. ఇలాంటి దౌర్జన్యాలు, దారుణాలను చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.