బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరు చెప్పి “బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్” పేరుతో అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి విరాళాలు వసూలు చేస్తున్న వైనం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంపై బాలయ్య తన ఫేస్ బుక్ ఖాతాలో స్వయంగా స్పందించారు. తన పేరు, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాలయ్య ఆ పోస్ట్ లో చెప్పారు.
వాస్తవానికి కలిసికట్టుగా ఉండి 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం న్యూజిలాండ్ టీడీపీ సభ్యులు అహర్నిశలు పాటుబడ్డారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం సమయం, డబ్బు వెచ్చించారు. అయితే, అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి న్యూజిలాండ్ టీడీపీని రెండు ముక్కలుగా విడగొట్టారు. టీడీపీ దూరం పెట్టిన ఓ సీనియర్ నేత ప్రోత్బలంతో ఆయన ఇలా వర్గాలు చేశారని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ పేరు చెప్పుకొని విరాళాలు వసూలు చేసుకుంటూ పబ్బం గడుపుతున్న ఆ సీనియర్ నేతకు ఆయన తోడయ్యారు.
అయితే, న్యూజిలాండ్ తో పాటు పలు దేశాలలోని ఎన్నారై గ్రూపులలో అశ్విన్ చిచ్చు పెట్టారని తెలుస్తోంది. దీంతో, అతడిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై టీడీపీ నేతలు, టీడీపీ, బాలయ్య బాబు అభిమానులు మండిపడుతున్నారు. ఆయన సత్యహరిశ్చంద్రుడు అంటూ టీడీపీ న్యూజిలాండ్ లోని వేర్పాటు వర్గం సభ్యులు ఓ వీడియో చేసి మరీ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అయితే, దానికి కౌంటర్ గా ఒరిజినల్ న్యూజిలాండ్ టీడీపీ సభ్యులు ఒక వీడియో రిలీజ్ చేశారు.
అంతేకాదు, బాలకృష్ణపై కోర్టుకు వెళతామని, లీగల్ యాక్షన్ తీసుకుంటామని వేర్పాటు వర్గం చెబుతోందని, బాలయ్య మీద కేసు పెడతారా లేక బసవతారకం ఆసుపత్రి మీద పెడతారా? అని ఒరిజినల్ న్యూజిలాండ్ టీడీపీ సభ్యులు, బాలయ్య బాబు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్, బాలకృష్ణ, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ పేరు చెప్పుకొని విరాళాలు వసూలు చేస్తున్న వారిపట్ల మిగతా దేశాల వారు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఇటువంటి నకిలీ మనుషులకు తాము కష్టపడి సంపాదించిన డబ్బులు ఇచ్చినందుకు బాధపడుతున్నామని వాపోతున్నారు.
అసలు ఈ విరాళాల కుంభకోణం వెనుక ఉన్న సూత్రధారులెవరో బయటకు రావాలని, టీడీపీ కేంద్ర కార్యాలయం కూడా స్పందించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని బాలయ్య బాబు ఫ్యాన్స్, టీడీపీ అభిమానులు, టీడీపీ ఎన్నారై నేతలు కోరుతున్నారు. అశ్విన్ వంటి వారు చేస్తున్న ఇటువంటి పనులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ ఎన్నారై నేతలు, టీడీపీ, బాలకృష్ణ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అతడిని ప్రోత్సహిస్తోన్న ఆ టీడీపీ సీనియర్ నేతపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.