ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు-ప్రతి విమర్శలు.. తార స్థాయికి చేరుకు న్నాయి. బీఆర్ ఎస్ పార్టీ హయాంలో 2023 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే వ్యవహారం కాక రేపిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందా న్ని నియమించి విచారణ చేయిస్తోంది. ఈ విచారణకు హాజరైన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్.. తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించినట్టు తెలిపారు.
అనంతరం ఆయన కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. అదేవిధంగా ఆయన కుమార్తె కవిత, అల్లుడు అనిల్, మేనల్లుడు హరీష్‌రావు సహా.. పార్టీలోని ఎమ్మెల్యేలు, అప్పటి మంత్రుల ఫోన్లు కూడా విన్నారని చెప్పారు. తన ఇంట్లో పనివారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని తెలిపారు. అంతేకా దు.. గత ఎన్నికలకు ముందు నగదు పట్టుకుని.. దానిని ఫామ్ హౌస్‌లో దాచారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై కేటీఆర్ స్పందిస్తూ.. ఆధారాలు ఉంటే నిరూపించాలన్నారు. లేకపోతే.. న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
అయితే.. దీనికి కౌంటర్‌గా బండి సంజయ్ శనివారం కూడా తన ఎదురు దాడిని కొనసాగించారు. తానేమీ తండ్రి-తాత పేర్లు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాను చెప్పింది అక్షర సత్యమని.. అన్నారు. కరీంనగర్‌లోని నివాసంలో ఆయన మీడియాతో మాట్టాడుతూ.. ఫోన్‌ట్యాపింగ్ చేయమన్నది కేసీఆరేనని.. దీనిని వెనుకుండి నడిపించి కేటీఆరేనని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి రాధాకిషన్ రావే చెప్పారని బండి వ్యాఖ్యానించారు.
తమ హయాంలో ఫోన్లు ట్యాపింగ్ కాలేదని కేటీఆర్ చెప్పగలరా? గండి మైసమ్మ గుడిదగ్గర ప్రమాణం చేయగలరా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ``కేటీఆర్‌కు సవాల్ విసురుతున్నా.. నేను నా కుటుంబం వచ్చి దేవుడి ముందు ప్రమాణం చేస్తాం. నువ్వు ప్రమాణం చేయగలవా?`` అని బండి సవాల్ రువ్వారు. కేసీఆర్‌కు సొంత కుటుంబంపైనా.. పార్టీ నాయకులపైనా కూడా నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. అందుకే..వారు ఏం చేస్తున్నారనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని అన్నారు. మొత్తానికి కేటీఆర్ వర్సెస్ బండివివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.