కేంద్ర ఎన్నికల సంఘం-కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీల మధ్య నెలకొన్న వివాదం తీవ్రస్థాయికి చేరింది. పలు ఆధారాలు చూపిస్తూ.. ఎన్నికల సంఘం తప్పులు చేసిందని, బీజేపీతో ములాఖత్ అయిందని రాహుల్ గాంధీ సుదీర్ఘ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకే వ్యక్తి పేరుతో వేల ఓట్లు, ఒకే డోర్ నెంబరులో వేలాదిఓట్లు ఎలా వచ్చాయని ఆయన గురువారం ప్రత్యేకంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. దీనిపై ఎన్నికల సంఘంకూడా అంతే దీటుగా ప్రతిస్పందించింది. అభ్యంతరాలు ఉంటే చెప్పడానికి ఆలస్యం ఎందుకని ప్రశ్నించింది.
వాస్తవానికి రాహుల్ గాంధీ లేవనెత్తినవన్నీ.. అభ్యంతరాలేనని, ఈ విషయం సామాన్య ఓటరుకు కూడా అర్ధమవుతోందని.. కానీ, ఈసీ మరోసారి ప్రశ్నించడం ఏంటని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. అయితే.. ఎ న్నికల సంఘం వాదన మరో విధంగా ఉంది. బీహార్‌లో 65 లక్షల ఓట్లను తొలగిస్తున్నట్టు ఆగస్టు 1వ తేదీనే తాము ప్రకటన చేశామని.. కానీ, అప్పట్లో ఎవరూ స్పందించ లేదని పేర్కొంది. ఇప్పుడు తమపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఈసీ వ్యాఖ్యానించింది. ఓట్ల తొలగింపు అనేది సర్వసాధారణ ప్రక్రియేనని పేర్కొన్న ఈసీ.. ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చని తెలిపింది. కానీ.. ఇలా యాగీ చేయడం ఏంటని నిలదీసింది.
మరోవైపు.. ఎన్నికల సంఘంపై దాడిని రాహుల్ మరింత తీవ్రతరం చేశారు. తాజాగా ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడు తూ.. ఎన్నికల సంఘానికి తాను ఐదు ప్రశ్నలు సంధిస్తున్నానని చెప్పారు. వాటికి ఈసీ సమాధానం చెప్పాలన్నారు. డిజిటల్ రూపంలో ఓటర్ల జాబితాను విడుదల చేయకపోవడం, పోలింగ్ బూతుల్లో సీసీటీవీ ఫుటేజీని స్మాష్ చేయడం, నకిలీ ఓటర్ల నమోదుకు అడ్డుకట్టవేయకపోవడం, ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా.. ప్రతిపక్ష నేతలను బెదిరించేలా వ్యాఖ్యలు చేయడం, బీజేపీకి ఈసీ ఏజెంట్‌గా వ్యవహరించడం.. వంటి అంశాలను ఆయన లేవనెత్తారు. భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకునే హక్కు ఉందన్నారు. దీనిపై ఈసీ స్పందించాల్సి ఉంది.