ఫోన్ ట్యాపింగ్ విచారణ వ్యవహారం రాజకీయంగా కీలక మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరైన కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ నాయకుడు బండి సంజయ్.. విచారణ అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో సొమ్ములు దోచుకుని ఫామ్ హౌస్‌లో దాచుకున్నా రని.. వారి పాపాలకు ఐపీఎస్ అదికారులను బలి చేశారని అన్నారు.
చివరకు భార్యా, భర్తల పడక గది ముచ్చట్లు కూడా విన్నారని బండి సంజయ్ అన్నారు. సొంత కుమార్తె.. కవిత, అల్లుడి ఫోన్లను ట్యాప్ చేశారని వ్యాఖ్యానించారు. అదేసమయంలో నమ్మిన బంటులా ఉన్న హరీష్‌రావునుకూడా మోసం చేశారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో అధికారులు ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఫోన్లు ట్యాప్ చేసి.. సొమ్మును పట్టుకున్నారని.. వేల కోట్ల సొమ్ము కేసీఆర్‌కు చేరిందని వ్యాఖ్యానించారు. దీనిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో వెంటనే స్పందించి బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్.. బండి సంజయ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని అన్నారు. ``48 గంటలు సమయం ఇస్తున్నా.. మాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే నిరూపించు. లేకపోతే.. క్షమాపణలు చెప్పు.`` అని కేటీఆర్ డిమాండ్ చేశారు. అంతే కాదు.. ఇంటెలిజెన్స్ కార్యకలాపాలు, అధికారుల పనితీరు కూడా తెలియదా? అని ప్రశ్నించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న బండి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
``ఇంటెలిజెన్స్ అధికారులు ఎలా పని చేస్తారో కూడా బండికి తెలియదు.`` అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బజారు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. చౌకబారు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, ఇంత దిగజారిపోతే తప్ప ఆయనకు కేంద్రంలో పదవి నిలిచేలా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రాజకీయ, పదవి ఉనికి కోసం రోడ్లపై చౌకబారు నాటకాన్ని ఎంచుకున్నా రు. అని దుయ్యబట్టారు. కేసీఆర్‌సహా తనపై చేసిన విమర్శలకు బండి నిరూపించాలన్నారు. లేకపోతే.. 48 గంటల్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.