బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీకి రెండు రోజుల కిందట రాజీనామా చేసిన గువ్వల బాలరాజు తాజాగా బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. ఆయన బీజేపీరాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్‌లో తన గ్రాఫ్‌ను వివరించారు. పార్టీకి ఎంతో నమ్మకస్తుడిగా పనిచేశానని.. కానీ, గత ఎన్నికల్లో పట్టుబట్టి సొంత పార్టీ నాయకులేతనను ఓడించారని చెప్పినట్టు తెలిసింది. పార్టీకి వీర విధేయుడిగా తాను పనిచేశానని చెప్పారు.
కేసీఆర్ కొందరికి కొమ్ముకాసి.. తన లాంటి నమ్మకస్తులకు ద్రోహం చేశారని గువ్వల వాపోయారు. బీజేపీ అంటే తనకు అభిమాన మని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనతో తెలంగాణకు న్యాయం జరుగుతోందని చెప్పినట్టు తెలిసింది. అందుకే..తాను బీజే పీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా రాం చందర్‌రావు.. బీజేపీ పరిస్థితి, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో పార్టీ ఎలా ఉందన్న వివరాలను గువ్వలతో చర్చించారు. పార్టీలోయువతను ప్రోత్సహించేందుకు ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నార ని తెలిపారు. అయితే.. ముందుగా పార్టీ తరఫున నియోజకవర్గంలో యువతను చేర్చుకునే పనిని ప్రారంభించాలని ఆయన సూచించారు.
కాగా.. అచ్చంపేట నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో విజయం దక్కించుకున్న గువ్వల బాలరాజు.. 2023లో ఓడిపోయా రు. అయితే.. తనను సొంత పార్టీ నాయకులే మోసం చేశారని ఆయన విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్‌పై ఆయన పదునైన విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయన బీఆర్ ఎస్‌కు దూరమై... తాజాగా బీజేపీ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 11న బీజేపీలో చేరనున్నారు. కాగా.. గువ్వలకు మూడు ప్రధాన హామీలు లభించినట్టు తెలిసింది. 1) వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట టికెట్. 2) నియోజకవర్గం ఇంచార్జ్ బాధ్యతలతోపాటు.. పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్‌గా కూడా నియమించనున్నారు. 3) తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మంత్రి పదవిపై కూడా హామీ ఇచ్చినట్టు తెలిసింది.