నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరు జిల్లా లగిసపల్లిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఏజెన్సీ అంటే దేవుడి అద్భుత సృష్టి అని, మళ్లీ జన్మ ఉంటే ఇక్కడే పుట్టాలనుకుంటున్నానని చంద్రబాబు అన్నారు.
స్వచ్ఛమైన, అందమైన కొండలు, ప్రకృతి ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయని, మంచి మనసున్న ప్రజలు ఇక్కడ నివాసం ఉంటారని చంద్రబాబు చెప్పారు. సహజ నైపుణ్యం, సామర్థ్యం ఆదివాసీల సొంతమని, గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. గిరిజనుల అభివృద్ధిపై మొట్టమొదట దృష్టిసారించింది అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఏడు ఐటీడీఏలను ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారులను నియమించామని చెప్పారు.
అవకాశాలు వస్తే అద్భుతాలు సృష్టించగల సత్తా గిరిజనుల సొంతమని కొనియాడారు. పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ కోసం తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. గిరిజనుల పిల్లలు చదువుకునేందుకు పాఠశాలల భవనాల కోసం నిధులు విడుదల చేస్తున్నామని, మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పుకొచ్చారు.
డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలను చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. గిరిజనులలో చైతన్యం తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని, తాను గతంలో సీఎంగా ఉన్న సమయంలో చైతన్యం కార్యక్రమాన్ని తీసుకువచ్చానని గుర్తు చేశారు.