తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మంత్రి కొండా సురేఖ భర్త.. కొండా మురళీధర్.. తాజాగా మరోసారి పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరయ్యారు. గతంలో వరంగల్‌కు చెందిన కడియం శ్రీహరి సహా.. పలువు రు నాయకులను ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇది రాజకీయంగా కొండా కుటుంబానికి ఇబ్బందిగా మారింది. మురళి వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు పార్టీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికే ఒకసారి క్రమ శిక్షణ సంఘం పిలుపుతో మురళీ హాజరయ్యారు. తన వివరణ ఇచ్చారు.
అయితే.. తాజాగా ఆదివారం కూడా మరోసారి ఆయన క్రమశిక్షణ సంఘం ముందుకు వచ్చారు. అయితే.. గతంలో చెప్పిన విషయాలనే ఈ దఫా లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని.. సంతకం చేయాలని క్రమశిక్ష ణ సంఘం కోరడంతో ఆయన అదే పనిచేశారు.అనంతరం మీడియాతో మాట్లాడిన మురళి.. తాను ఎన్ని సార్లు రమ్మన్నా సంఘం ముందుకు వస్తానన్నారు. అయితే.. ఆయన వ్యాఖ్యల్లో అసహనం కనిపించడం గమనార్హం. ``ఎన్ని సార్లు రమ్మన్నా వస్తా. వందసార్లు పిలిచినా వస్తా. నేను పార్టీకి వ్యతిరేకం కాదు`` అని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు తన దృష్టంతా వచ్చే స్థానిక ఎన్నికలపైనే ఉందని మురళి చెప్పారు. పార్టీని బలోపేతం చేయ డం.. అందరికీ అండగా ఉండడం, అందరినీ గెలిపించడమే తన పని అని వ్యాఖ్యానించారు. తాను చేసిన వ్యాఖ్యలపై గతంలోనే వివరణ ఇచ్చానన్నారు. ఇప్పుడు తాను అవే వ్యాఖ్యలకు సంబంధించి లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చినట్టు తెలిపారు. పార్టీ మరో 25 సంవత్సరాలు అధికారంలో ఉండాలని కోరుకునే నాయకుల్లో తాను మొదటి వరుసలో ఉంటానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్టు చెప్పారు. తాను ఎప్పటికీ పార్టీకి విధేయుడినేనని మురళీ వెల్లడించారు.