రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఉలుకు పలుకు, ముందస్తు సమాచారం ఏమీ లేకుండా.. తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మంత్రులు.. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. ఏపీలోని అధికార కూటమిలో జనసేన కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి జనసేన గురించి కాంగ్రెస్ ఎప్పుడూ.. కామెంట్లు చేయలేదు. జనసేన కూడా కాంగ్రెస్‌పై ఎప్పుడూ ప్రస్తావన చేయలేదు.
అలాంటిది అనూహ్యంగా ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి తెలంగాణ మంత్రులు రావడం.. వారిని జనసేన పార్టీ కీలక నాయకులు ఘనంగా సత్కరించడం రాజకీయ వర్గాలను విస్మయాని కి గురిచేసింది. అయితే.. దీనిలో ఎలాంటి రాజకీయాలు లేవని.. జనసేన పార్టీ పేర్కొంది. విషయం ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి, సీనియర్‌నాయకుడు, బాపట్ల నియోజకవర్గానికి చెందిన నేత ఇంట్లో శుభకార్యం జరిగింది. దీనికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఆహ్వానించారు.
దీంతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు ప్రత్యేక హెలికాప్టర్‌లో ఏపీకి వచ్చారు. అయితే.. హెలిప్యాడ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయకుండా.. జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్న హెలిప్యాడ్‌ను వారు వినియోగించుకున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా మంగళగిరికి వచ్చి.. ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఇంటికి వెళ్లారు.
ఈ సందర్భంగా తమ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న హెలిప్యాడ్ కు చేరుకున్న తెలంగాణ మంత్రుల ను జనసేన నాయకులు ఘనంగా స్వాగతించారు. మంగళగిరి చేనేత శాలువాలతోపాటు.. ప్రపంచ ప్రఖ్యా త కొండపల్లి బొమ్మలను వారికి అందించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్‌లో పోస్టు చేయడంతో విషయం వెలుగు చూసింది. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి ఇక్కడకే వచ్చి హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.