ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో అయితే తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన సందర్భంలోనూ కొందరు వైసీపీ నాయకులు అక్కడ రాజకీయాల గురించి మాట్లాడి తమ ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలు గుప్పించేవారు. దైవ దర్శనానికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం సరికాదని భావించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు...ఆలయ ప్రాంగణంలో రాజకీయ, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంపై నిషేధం విధించారు.
అధికారం పోయినా...తిరుమలలో రూల్స్ మారినా సరే వైసీపీ నేతల తీరు మారలేదు. జగన్ మేనమామ, మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాధ్ రెడ్డి నిన్న తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే టీటీడీ నిబంధనలు ఉల్లంఘించి శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ప్రకటనలు చేసిన రవీంద్రనాధ్ రెడ్డిపై తాజాగా కేసు నమోదైంది. ఆలయ ప్రాంగణంలో రాజకీయ, ద్వేషపూరిత ప్రకటనలు చేశారని రవీంద్రనాథ్ రెడ్డిపై పోలీసులకు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో, రవీంద్రనాథ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.