ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా ఒక్కొక్క హామీనీ అమలు చేసుకుంటూ పోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆగస్టు 15 నుంచి ఏపీలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది.
రాష్ట్రంలోని బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు నిర్దేశించిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది చంద్రబాబు ప్రభుత్వం. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్..ఈ ఐదు కేటగిరీలకు చెందిన బస్సులలో ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కార్డులు లేదా ప్రభుత్వం సూచించిన ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే, సదరు మహిళలంతా ఏపీలో శాశ్వత నివాసం, గుర్తింపు కార్డు పొంది ఉండాలి.
సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, స్టార్ లైనర్, ఏసీ, ఆల్ట్రా డీలక్స్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండదు. దాంతోపాటు, తిరుమల-తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం వర్తించదు. నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సులు, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్ సర్వీసుల్లో మహిళల ఉచిత ప్రయాణం ఉండదు.
మహిళలకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేసి...ఆ ఖర్చును ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుంది. తెలంగాణలో ఈ పథకం అమలు సమయంలో వచ్చిన ఇబ్బందుల నేపథ్యంలో ఏపీలోని అన్ని బస్సుల్లో ఇకపై సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలని ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు జారీ అయ్యాయి.