ఏపీలో మరికొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల సరిహద్దులు, పేర్ల మార్పు, మండలాల మార్పులు, చేర్పులపై అధికారులు సన్నాహాలు మొదలుబెట్టారు. ఏడుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటులో వైసీపీ ప్రభుత్వం కొన్ని తప్పులు చేసిందని, వాటిని సరిచేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
పలు కొత్త జిల్లాల డిమాండ్‌లు తెరపైకి రావడంపై కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. మార్కాపురం జిల్లా ఏర్పాటుపై చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లాకు రాయచోటి కాకుండా రాజంపేట ప్రధాన కేంద్రంగా ఉండాలన్న డిమాండ్ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాకు నర్సాపురాన్ని ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేుస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాకు హిందూపురం జిల్లా కేంద్రంగా ఉండాలని అక్కడి ప్రజల ఆకాంక్ష. ఈ క్రమంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం ఉంది.
కొత్తగా అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి, మార్కాపురం జిల్లాలు వచ్చే అవకాశం ఉంది. అంటున్నారు. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం, పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారట. అమరావతి కేంద్రంగా ఏర్పాటయ్యే అవకాశమున్న కొత్త జిల్లాలో పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు చేరబోతున్నాయని తెలుస్తోంది.