సీఎం రేవంత్ రెడ్డి భాష, హావభావాలు మార్చుకోవాలని కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గంటల కొద్దీ మాట్లాడడం మానేయాలని, మిగతా మంత్రులకు కూడా మాట్లాడే చాన్స్ ఇవ్వాలని ఆయన చేసిన కామెంట్లు కాక రేపాయి. తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి మరిచారని ఆయన ఫైర్ అయ్యారు. అన్నదమ్ములకు మంత్రి పదవులిచ్చేందుకు సమీకరణాలు కుదరడం లేదని రేవంత్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
తనన పార్టీలోకి తీసుకున్నప్పుడు, మంత్రి పదవి ఇస్తామని ప్రామిస్ చేసినప్పుడు ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని తెలియదా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఇద్దరం సమర్థులమే అయిన్పుడు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని అన్నారు. సమీకరణాలు కుదరకుండా ఎవరు అడ్డుకుంటున్నారని నిలదీశారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారని, 11 మంది ఎమ్మెల్యేలున్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు.