భారత ఆర్థిక వ్యవస్థను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 'డెడ్ ఎకానమీ' అని చేసిన విమర్శలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ కామెంట్లకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఎవరిది డెడ్ ఎకానమీ అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని చంద్రబాబు చురకలంటించారు. భారతదేశంపై సుంకాలు విధించి అమెరికా తాత్కాలిక ఇబ్బందులు మాత్రమేనని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలమైనదని, భారతీయుల సేవలు ప్రపంచానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. భారతీయులకు ఉద్యోగాలివ్వని దేశాలు అభివృద్ధి చెందలేవని చెప్పారు.
ప్రధాని మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో మన దేశం ఆర్థికంగా బలమైన శక్తిగా ఎదిగిందని అన్నారు. ఒకప్పుడు మనది పేద దేశం అనేవారని...11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను 11 ఏళ్ల కాలంలో మోదీ 4వ స్థానానికి చేర్చారని చెప్పారు. 2028 నాటికి అది 3వ స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2047లో వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా భారత్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.