ఈ మధ్య కాలంలో ‘కూలీ’ సినిమాకు వచ్చిన హైప్ మరే చిత్రానికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో శివాజీ, రోబో, కబాలి లాంటి చిత్రాలకు మాత్రమే ఈ హైప్ కనిపించింది. కానీ ‘కబాలి’ నిరాశపరచడం.. ఆ తర్వాత వరుస ఫ్లాపులు పడడంతో రజినీ క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ‘జైలర్’ ఒక్కటి మంచి విజయం సాధించినా.. దానికి కూడా రిలీజ్ ముంగిట పెద్ద హైప్ లేదు.
గత ఏడాది రజినీ నుంచి వచ్చిన ‘వేట్టయాన్’ అయితే ఆయన కెరీర్లోనే అతి తక్కువ హైప్‌తో రిలీజైంది. కానీ అలాంటి సినిమా తర్వాత వస్తున్న ‘కూలీ’కి క్రేజ్ మామూలుగా లేదు. ‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేయడం.. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ లాంటి క్రేజీ కాస్టింగ్ ఉండడం.. ప్రోమోలు, పాటలు బాగుండడం దీని హైప్‌ను పెంచుతూ పోయాయి. దీంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో నడుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చూడని స్థాయిలో పెద్ద ఎత్తున కార్పొరేట్ బుకింగ్స్ ఈ సినిమాకే జరుగుతున్నాయి.
చెన్నైలో ఒక ప్రముఖ థియేటర్ యజమాని ‘కూలీ’ కార్పొరేట్ బుకింగ్స్ గురించి ఆసక్తికర విశేషాలు చెప్పాడు. ‘కబాలి’ సినిమాకు తొలి వీకెండ్లో కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున షోలను బుక్ చేసుకున్నాయట. అంటే ఒక థియేటర్లో ఉన్న అన్ని టికెట్లను బల్క్‌గా బుక్ చేసేయడం అన్నమాట. తొలి వీకెండ్లో ఇలా థియేటర్లు థియేటర్లే బుక్ చేసేయడం ‘కబాలి’ సినిమాకు పెద్ద ఎత్తున జరిగిందని.. మళ్లీ ఏ సినిమాకూ ఆ స్థాయిలో కార్పొరేట్ బుకింగ్స్ జరగలేదని ఆయన వెల్లడించారు.
ఇప్పుడు ‘కూలీ’కి అదే డిమాండ్ ఉందని.. చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లో కార్పొరేట్ సంస్థలు షోలు షోలనే బుక్ చేసుకుంటున్నాయని.. ఇలాంటి హైప్ ఈ మధ్య కాలంలో చూడలేదని ఆయన తెలిపారు. సౌత్ ఇండియాలో ఈ ట్రెండ్ మొదలుపెట్టిందే రజినీకాంత్ అని ఆయన కొనియాడారు. ఇదంతా సినిమాకు ఉన్న డిమాండ్ మేరకే జరుగుతోందన్నది స్పష్టం. కానీ కొందరు ‘వార్-2’కు వ్యతిరేకంగా ఇదేదో కుట్రపూరితంగా జరుగుతున్నట్లుగా విషయంలా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుండడం గమనార్హం.