ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజధాని అమరావతిలో కీలక అడుగు వేశారు. పేదలకు అత్యంత ఖరీదైన క్యాన్సర్ వైద్యాన్ని అతి తక్కువకు అందించాలనే లక్ష్యంతో తాను ఛైర్మన్ గా ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని ఏపీలో విస్తరించేందుకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రి నిర్మాణానికి ఈరోజు ఉదయం బాలయ్య శంకుస్థాపన చేశారు. తుళ్లూరు గ్రామం సమీపంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఈ భూమిపూజను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, నారా బ్రహ్మణి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే ఆస్పత్రి నిర్మాణానికి సహకరిస్తున్న క్యాన్సర్ వైద్య నిపుణులు డా. దత్తాత్రేయుడు నోరి, డా. పోలవరపు రాఘవ రావు, డా. గడ్డం దశరథరామి రెడ్డి వంటి వారు భూమి పూజలో భాగం అయ్యారు. అమరావతిలో రూపుదిద్దుకోబోతున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రత్యేకతల విషయానికి వస్తే.. మొత్తం 21 ఎకరాల విశాలమైన ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండేలా అద్భుతంగా, అత్యాధునికంగా హాస్పిటల్‌ను తీర్చిదిద్దబోతున్నారు.
నేలపాడు నుంచి అనంతవరం వెళ్లే ఈ-7 రహదారిని ఆనుకుని బసవతారకం హాస్పటల్ ను నిర్మిస్తున్నారు. రెండు దశల్లో అభివృద్ధి పనులు జరగనున్నాయి. మొదటి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలు రోగులకు అందించేలా ప్రణాళిక రచించారు. ఈ దశలో రూ.750 కోట్ల భారీ పెట్టుబడితో మౌలిక సదుపాయాలు నిర్మించి, అత్యాధునిక వైద్య పరికరాలను సమకూరుస్తారు. 2028 నాటికి మొదటి దశ పనులు పూర్తి కానుండగా.. రెండో దశలో పడకల స్థాయిని వెయ్యికి పెంచనున్నారు. ప్రత్యేక వైద్య విభాగాలు, పరిశోధన విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా క్లిష్టమైన, అత్యాధునిక క్యాన్సర్ కేసులకు ఈ కేంద్రాన్ని ప్రాంతీయ రిఫరల్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నారు.