వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్.. తాజాగా బుధవారం తాడేపల్లిలోని నివాసంలో సుదీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ టీసీ స్థానాల ఉప ఎన్నికలకు సంబంధించిన అవకతవకలు, పోలీసులు వ్యవహరించిన తీరు వంటివాటిని వివరించారు. వీటికి సంబంధించిన విజువల్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటివి కూడా చేశారు. మొత్తానికి సుమారు 4 గంటల పాటు జగన్ జాతీయ, రాష్ట్ర మీడియాతో కూర్చుని అనేక విషయాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జీవితంలో.. అంటూ సీరియస్ కామెంట్లు చేశారు. ``చంద్రబాబు జీవితంలో ఇవే చివరి ఎన్నికలు. కావొచ్చు.. కృష్ణారామా అనుకో !`` అని జగన్ వ్యాఖ్యానించారు. పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని.. ఒక్కొక్క ఓటరుకు ఒక్కొక్క రౌడీని పెట్టి బెదిరించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకున్నారని విమర్శించారు. ``చంద్ర బాబుకు నేను ఒక్కటే చెబుతున్నా. నీ చేతిలో మీడియా ఉందని.. నీ చేతిలో అధికారం ఉందని ఇప్పుడు రెచ్చిపోతున్నావ్. నీకు ఇదే చివరి ఎన్నిక కావొచ్చు.`` అని హెచ్చరించారు.
ఇంత అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగిన విధానం దేశంలో ఇదే తొలిసారి అని జగన్ వ్యాఖ్యానించారు. తాను అనేక ఎన్నికలు చూశానని.. కానీ, విచ్చలవిడిగా పోలీసులను, రౌడీలను కూడా రంగంలోకి దింపి ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని జగన్ దుయ్యబట్టారు. ఏపీలో పోలీసులు అయితే.. అధికార పార్టీకి దాసోహం చేస్తారు. లేకపోతే, వైసీపీ నాయకులపై కేసులు పెట్టేందుకు మాత్రమే ఉన్నారని విమర్శించారు. ఉన్నతాధికారులు సైతం ఇంతగా పాదపూజలు చేస్తారని అనుకోలేదని వ్యాఖ్యానించారు.
పులివెందుల, ఒంటిమిట్టల్లో రిగ్గింగుకు పాల్పడడమే కాకుండా.. అసలు నియోజకవర్గంతో సంబంధం లేని బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి, మంత్రి సవిత తదితరులు అక్కడే తిష్ఠ వేసి మరీ ఓటర్లను భయ భ్రాంతులకు గురి చేశారని జగన్ అన్నారు. తమకు అనుకూలంగా ఉండే ఓటర్లను మాత్రమే బూతుల్లోకి అనుమతించారని వ్యాఖ్యానించారు. వైసీపీకి అనుకూలంగా ఉంటారని తెలిస్తే.. అసలు బూతుల వైపు కూడా రానివ్వకుండా అడ్డుకున్నారని చెప్పారు. అందుకే.. ఈ రెండు చోట్ల తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కోర్టును ఆశ్రయించనున్నట్టు చెప్పారు.