టాలీవుడ్లో కొంచెం లేటుగా రైజ్ అయి, ప్రస్తుతం అగ్ర నిర్మాతల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు విశ్వప్రసాద్. పీపుల్స్ మీడియా బేనర్ మీద ఆయన ఒకేసారి రెండంకెల సంఖ్యలో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుండడం విశేషం. ‘రాజా సాబ్’ సహా ఆయన చేతిలో క్రేజీ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. గతంలో మీడియాకు పెద్దగా దొరకని విశ్వప్రసాద్.. ఈ మధ్య బాగానే హైలైట్ అవుతున్నారు.
ఇంటర్వ్యూల్లో ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని సంచలన విషయాలు మాట్లాడడం ద్వారా వార్తల్లోకి వస్తున్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సినిమా మేకింగ్ సందర్భంగా దోపిడీ గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కెమెరామన్, ఆర్ట్ డైరెక్టర్లు అవనసర ఖర్చు పెట్టించి బడ్జెట్లు పెంచుతారని ఆయన ఆరోపించారు.
ముఖ్యంగా ఆర్ట్ డైరెక్టర్ల గురించి మాట్లాడుతూ.. ‘ఆర్ట్ మాఫియా’ అనే పదం వాడడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఆయనపై ఆర్ట్ డైరెక్టర్ల అసోషియేషన్ మండిపడింది. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ‘‘సినిమాల చిత్రీకరణలో ఆర్ట్ డైరెక్టర్లు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తారు. అలాంటి వారిని ఉద్దేశించి విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్ట్ మాఫియా’ అన్నారు.
ఆయన మాటలను ఖండిస్తున్నాం. సినిమా షూటింగ్ సందర్భంగా ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతాయి. సెట్స్‌లోనూ మార్పులు ఉంటాయి. నిర్మాతల అనుమతితోనే ఆ మార్పులు చేస్తాం. అలాంటపుడు కొన్నిసార్లు ఖర్చులు పెరుగుతాయి. కొన్నిసార్లు తగ్గుతాయి. దీన్ని గమనించాలి. ఖర్చు విషయంలో నిర్మాతకు పూర్తి అవగాహన ఉంటుంది. అవగాహన లోపం వల్లే నష్టాలు వస్తాయని ఆయన తెలుసుకోవాలి.
ఆయనకు ఏమైనా ఇబ్బందులుంటే ఫిలిం ఛాంబర్ దృష్టికి తీసుకువెళ్లాలి. అంతే కానీ మీడియాకు ఎక్కి మా మీద నిందలు వేయడం సరి కాదు’’ అని ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. పీపుల్స్ మీడియా సంస్థ మీద ఐవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిన రోజే ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఆ సంస్థ అధినేతకు వ్యతిరేకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం గమనార్హం.