పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. జగన్ కంచుకోట బద్దలు కొట్టి మరీ ఈ రెండు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. అయితే, ఓటమి తప్పదని భావించిన వైసీపీ కార్యకర్తలు కొందరు...పోలీసులపై దురుసుగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో కొందరు వైసీపీ కార్యకర్తలు డీఐజీ కోయ ప్రవీణ్ పై నోరు పారేసుకున్నారు. దీంతో, వారికి దిమ్మదిరిగే వార్నింగ్ ఇచ్చిన కోయ ప్రవీణ్ ఖాకీ యూనిఫాం పవర్ చూపించారు. ఈ క్రమంలోనే అసలు ఎవరీ కోయ ప్రవీణ్? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్న చర్చ మొదలైంది.
పులివెందులలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేసి, అక్రమంగా మైన్స్ ఆక్రమించుకున్న ఫ్యామిలీ నుంచి కోయ ప్రవీణ్ రాలేదు. కొవ్వూరు తాలూకాలోని ఓ మామూలు కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యావంతులుగా ఎదిగిన ఐదుగురు అన్నదమ్ముల్లో ప్రవీణ్ ఒకరు. ఐదుగురు అన్నదమ్ముల్లో ఒకరు సీఏ, ఇద్దరు డాక్టర్లు, ఒకరు ఇంజనీర్, ఇంకొకరు కామర్స్ గ్రాడ్యుయేట్. రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి 120వ ర్యాంక్ తో (జియోగ్రఫీ, అంత్రోపాలజీ ఆప్షనల్స్ తో) యూపీఎస్సీ క్రాక్ చేసిన చదువుల తల్లి ముద్దుబిడ్డ ప్రవీణ్.
విధి నిర్వహణలో తల పండిన రాజకీయ నేతలకు సైతం చుక్కలు చూపించిన ట్రాక్ రికార్డ్ ప్రవీణ్ ది. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా సమయం అయిపోయిన తర్వాత మంత్రి బొత్స మేనల్లుడు మజ్జి శీను ప్రచారం చేస్తుంటే ఆయనను అరెస్టు చేయబోయారు ప్రవీణ్. చివరకు బొత్స కాళ్లా వేళ్లా పడితే మజ్జి శీనుకు స్టేషన్ బెయిల్ వచ్చింది. 2019 ఎన్నికల సమయంలో ప్రకాశం ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్... చీరాల మాజీ ఎమ్మల్యే ఆమంచికి పట్టపగలే చుక్కలు చూపించారు. ఆ జిల్లాలో కేవలం 49 రోజులు డ్యూటీ చేసిన ప్రవీణ్...విక్రమార్కుడు సినిమాలో రవితేజ మాదిరి డ్యూటీ చేశారు. స్టేషన్ కి ఒకడే రౌడీ ఉండాలి..వాడు ఎస్సై అయి ఉండాలి అన్న రీతిలో అసాంఘిక శక్తుల ఆట కట్టించారు ప్రవీణ్.
ఆ కక్ష తో ప్రవీణ్ ను 13 నెలలు వీఆర్ కు పంపింది వైసీపీ ప్రభుత్వం. జీతం లేకుండా చేసినా సరే... పోస్టింగ్ కోసం ఎవరినీ బతిమిలాడకుండా సొంత ఊళ్లో వ్యవసాయం చేసుకున్న నిజాయితీపరుడు ఆయన. జగన్ ఐదేళ్ల పాలనలో ప్రవీణ్ కు అనామక పోస్టింగులు ఇచ్చిన సంగతి జగనెరిగిన..జగమెరిగిన సత్యమే. ఇక, టీడీపీ మాజీ ఎంపీ గరికిపాటి మోహనరావు అల్లుడు ప్రవీణ్ అని దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు ఈ విషయం మరిచిపోయారు. 2019లో మోహనరావు టీడీపీని వదిలి బీజేపీలో చేరారు.
జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలు కోల్పోయినందుకే ఇలా లబోదిబోమంటే..మరో ఏడాదిలో రాష్ట్రం మొత్తం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే సీన్ రిపీట్ అయితే...వైసీపీ నేతల పరిస్థితి ఏంటో ఊహకే అందడం లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో చిరంజీవి చెప్పినట్లు...ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్...అదేనండీ..ముందుంది ముసళ్ల పండగ!