రాహుల్‌పై జ‌గ‌న్ చిందులు.. ఏమ‌న్నారంటే!

admin
Published by Admin — August 14, 2025 in Politics
News Image
కాంగ్రెస్ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చిందులు తొక్కారు. ``రాహుల్ అనే వ్య‌క్తి.. `` అంటూ ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓట్ చోరీపై దేశ‌వ్యాప్త ఉద్య‌మం చేస్తున్నాన‌ని చెబుతున్న రాహుల్ గాంధీకి ఏపీలో ఏం జ‌రిగిందో తెలియ‌దా? ఏపీలో ఎంత మోసం చేశారో తెలియ‌దా? అని ప్ర‌శ్నించారు. 2024 ఎన్నిక‌ల్లో పోలైన ఓట్ల‌కు, లెక్కించిన ఓట్ల‌కు మ‌ధ్య 12.5 శాతం వ్య‌త్యాసం ఉంద‌ని.. దీనిపై తాము ఎన్నిక‌ల సంఘానికి అనేక సార్లు ఫిర్యాదులు కూడా చేశామ‌ని జ‌గ‌న్ చెప్పారు.
 
ఇంత భారీ మోసం ఎప్పుడైనా.. ఎక్క‌డైనా జ‌రిగిందా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఇత‌ర రాష్ట్రాల్లో ఓట‌ర్లు, జాబితాలు.. నకిలీలు అంటూ.. పెద్ద ఎత్తున ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ చేసిన రాహుల్‌కు.. ఏపీలో జ‌రిగిన అక్ర‌మాలు క‌నిపించ‌లేదా? అన్యాయాలు క‌నిపించ‌లేదా? అని నిల‌దీశారు. చంద్ర‌బాబును, ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప‌న్నెత్తు మాట కూడా అనలేద‌న్నారు. దీనికి కార‌ణం.. `హాట్‌లైన్‌` స్నేహం ఉంద‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా.. చంద్ర‌బాబుతో స్నేహం ఉంద‌ని.. అందుకే ఆయ‌న ఏపీ గురించి ప‌న్నెత్తు మాట కూడా అన‌లేద‌న్నారు.
 
ఏపీలో కూడా ఓట్ల చోరీ జ‌రిగింద‌ని.. దీనిపై తాము అనేక సంద‌ర్భాల్లో ఎన్నిక‌ల సంఘానికి రిప్ర‌జెంటేష‌న్ ఇచ్చామ‌ని జ‌గ‌న్ చెప్పారు. అయినా.. త‌మ‌కు ఎలాంటి న్యాయం జ‌ర‌గ‌లేద‌న్నారు. దాదాపు 48 లక్ష‌ల ఓట్ల‌ను క‌లిపి లెక్కించార‌ని.. జ‌గ‌న్ ఆరోపించారు. దీనిపై రాహుల్ ఎందుకు మాట్లాడ‌లేద‌న్నారు. ఇక‌, ఏపీ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ పైనా జ‌గ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న‌కు చంద్ర‌బాబు కానీ, ఆయ‌న పాల‌న‌లో జ‌రుగుతున్న అన్యాయాలు కానీ క‌నిపించ‌డం లేద‌ని..కేవ‌లం జ‌గ‌న్ మాత్ర‌మే క‌నిపిస్తున్నాడ‌ని ఎద్దేవా చేశారు.
 
ఇది కూడా హాట్‌లైన్‌లో భాగ‌మేన‌ని చెప్పారు. ``ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జి మాణికం ఠాకూర్ ఏరోజైనా చంద్ర బాబు గురించి మాట్లాడాడా?. కానీ, నా గురించి మాట్లాడుతున్నాడు. ఏపీలో జరుగుతున్న అక్రమాల పై ఏరోజైనా మాట్లాడాడా?. కాంగ్రెస్‌ అధిష్టానంతో చంద్రబాబు టచ్‌లో ఉన్నారు.`` అని జ‌గ‌న్ దుయ్య‌బ‌ట్టారు. రేవంత్ రెడ్డి ద్వారా చంద్ర‌బాబు కాంగ్రెస్‌తో చేతులు క‌లిపి.. త‌న అక్ర‌మాల‌ను ప్ర‌శ్నించ‌కుండా చేసుకుంటున్నాడు.. అని వ్యాఖ్యానించారు. కాగా.. ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags
Rahul Gandhi ex cm jagan comments vote theft
Recent Comments
Leave a Comment

Related News