సినీ రంగానికి చెందిన ముందు తరం వ్యక్తులు ఎవరైనా కష్టంలో ఉన్నట్లు తమ దృష్టికి వస్తే స్టార్ హీరోలు స్పందించి సాయం చేయడం చూస్తుంటాం. సాధారణంగా ఆ సాయం కొన్ని లక్షల వరకే ఉంటుంది. కానీ ఒక నటుడు, అది కూడా తమ భాషకు చెందని వాడు అనారోగ్యంతో ఉంటే ఒక హీరో కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు అంటే నమ్మశక్యంగా అనిపిస్తుందా? కానీ మెగాస్టార్ చిరంజీవి ఇదే పని చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు.
ఒకప్పుడు తెలుగులోనూ అనేక సినిమాల్లో నటించిన తమిళ నటుడు పొన్నాంబళం.. కొన్నేళ్ల కిందట కిడ్నీ సంబంధిత వ్యాధితో మృత్యు అంచులకు చేరిన సంగతి తెలిసిందే. చిరంజీవితో ‘ఘరానా మొగుడు’ సహా పలు చిత్రాల్లో నటించాడు పొన్నాంబళం. తన పరిస్థితి తెలిసి చిరు సాయానికి ముందుకు వచ్చాడు. ఐతే తనకు చిరు సాయం చేస్తాను అన్నాడంటే ఒక లక్ష రూపాయలు ఇస్తాడేమో అనుకున్నానని..
కానీ ఇప్పటిదాకా తన ఆరోగ్యం కోసం ఆయన ఏకంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టాడని పొన్నాంబళం తాజాగా వెల్లడించాడు. గత ఏడాది అనారోగ్యం నుంచి కోలుకున్నాక పొన్నాంబళం.. చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం కోసమే చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ సందర్భంగా తాను బతుకుతున్న బతుకు చిరంజీవిదే అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సకు సంబంధించి మొత్తం ఖర్చు తనే పెట్టుకుంటానని ముందుకు వచ్చిన చిరు.. రూ.58 లక్షలు వెచ్చించినట్లు ఆ సందర్భంగా పొన్నాంబళం వెల్లడించాడు.
ఇప్పుడేమో తన కోసం చిరు పెట్టిన ఖర్చు కోటి రూపాయలని ఆయన వెల్లడించారు. బహుశా సర్జరీ తర్వాత కూడా మరింత ఖర్చు అయి ఉండొచ్చు. దాన్ని కూడా చిరునే భరించి ఉండొచ్చు. ఎంత పెద్ద మనసు ఉన్నా సరే.. 5 లక్షలో 10 లక్షలో ఇచ్చి సరిపుచ్చుతారు కానీ.. ఇలా కోటి రూపాయలు పెట్టి వేరే ఇండస్ట్రీకి చెందిన నటుడి జీవితాన్ని నిలబెట్టడం చిరుకే చెల్లింది.