వైసీపీ అధినేత జగన్‌పై ఆయన సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. చం ద్రబాబు-రాహుల్ హాట్‌లైన్‌లో మాట్లాడుకుంటారని.. అందుకే రాహుల్ గాంధీకి ఏపీలో జరిగిన ఎన్నికల అక్రమాలు కనిపించడం లేదని ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ హాట్ లైన్ లో చంద్రబాబు ఉన్నారని జగన్ అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. అసలు మోడీతో జగనే హాట్‌లైన్‌లో ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు.
అసలు మోడీతో `హాట్ లైన్`లో ఉన్నది జగన్ నేనని షర్మిల చెప్పారు. రాహుల్ గాంధీకి, చంద్రబాబుకు మధ్య ఎలాంటి హాట్ లైన్ లేదన్నారు. ``మీరు మోడీతో హాట్ లైన్ లో ఉన్నారని అందరికీ తెలిసిందే. ఒక వేళ అలాంటిదేమీ లేదని అంటే.. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పగలరా?`` అని జగన్‌ను ప్రశ్నించారు. జగన్ మోడీకి ఎప్పుడూ మద్దతు ఇస్తూనే వచ్చారన్న షర్మిల... మోడీ హాట్ లైన్ లో ఉన్నది జగనేనని వ్యాఖ్యానించారు. ``మా పార్టీ నేత మాణిక్కం ఠాకూర్ ను `వాడు ఎవడు` అంటూ చులకనగా మాట్లాడటం ఎంత వరకూ సమంజసం?`` అని జగన్‌ను ప్రశ్నించారు.
జగన్ తన పార్టీలో అరెస్ట్ అయిన నేతల్ని చూడటానికి వెళ్లి తలకాయలు తొక్కించేసినట్టుగా రాహుల్ గాంధీ వ్యవహారం ఉండదని షర్మిల చెప్పారు. ``నిజంగా మోడీకి వ్యతిరేకంగా పోరాడే దమ్ము జగన్ కు ఉందా? మోడీకి అసలు దత్త పుత్రుడిగా మారింది జగనే.`` అని షర్మిల నిప్పులు చెరిగారు. మరోవైపు.. మద్యం కుంభకోణంపైనా ఆమె స్పందించారు. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి లిక్కర్ స్కామ్ పై మాట్లాడాలి. క్యాష్ రూపంలోనే మద్యం లావాదేవీలు ఎందుకు జరిపారో అసెంబ్లీలో చెప్పాలి.`` అని ఆమె డిమాండ్ చేశారు.
పార్లమెంట్ కు వెళ్లి ప్రత్యేక హోదా మీద పోరాడాలన్నారు. అయితే.. ఆ విషయాలపై మాత్రం జగన్‌కు దమ్ము ఉండదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేస్తే.. జగన్ ఇమేజ్ పెరగదని.. పైగా తాము అసలు ఊరుకునేది కూడా లేదన్నారు. కాగా.. `ఓట్ చోరీ' వ్యవహారం నేపథ్యంలో విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో షర్మిల పాల్గొన్నారు. 'ఓట్ చోర్ ప్రతీ చోట' అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టిందని ఆమె తెలిపారు.