ఢిల్లీలోని వీధి కుక్కల వ్యవహారం జాతీయస్థాయిలో ఉద్యమానికి దారి తీస్తోంది. దేశరాజధానిలో విచ్చల విడిగా పెరిగిపోయిన కుక్కలను 8 వారాల్లోగా నగరం నుంచి తరిమేయాలని.. దూరంగా ప్రత్యేక షెల్టర్లు ఏర్పటు చేసి.. వాటిని అక్కడికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ ఆదేశాలను సవరించాలని కోరుతూ.. బాలీవుడ్ నుంచి రాజకీయ వర్గాల వరకు అందరూ ముక్తకంఠంతో నినదించారు. జంతువులపై ప్రేమ చూపించాలే తప్ప.. క్రూరంగా వ్యవహరించారని అందరూ వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌కు పలువురు మేధావులు, సినీరంగానికి చెందిన వారు లేఖలు సంధించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో స్పందించిన ప్రధాన న్యాయమూర్తి గత ఆదేశాలపై మరోసారి వాదనలు వినేందుకు.. త్రిసభ్య ధర్మాసనా న్ని ఏర్పాటు చేశారు. గత ఆదేశాలను సమీక్షించి, అవసరమైతే.. మార్పులు చేయాలని సూచించారు. దీంతో గురువారం సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై మరోసారి వాదనలు ఆలకించింది.
అయితే.. అటు ప్రభుత్వం తరఫున, ఇటు ప్రతివాదుల తరఫున సుదీర్ఘ వాదనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. మాంసాహారం తినేవారు కూడా.. జంతువు లపై ప్రేమను ఒలకబోస్తున్నారని వ్యాఖ్యానించారు. కానీ, సాధారణ పౌరులు కుక్కలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రెబీస్ కారణంగా.. ఏటా లక్షల మంది మృతి చెందుతున్నారని.. గత ఆదేశా లను సవరించాల్సిన అవసరం లేదన్నారు.
ఇక, ప్రతివాదులు, పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబల్.. కుక్కలతో పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. అయితే.. వాటికి సరైన నిర్వహణ లేకపోవడమే కారణమన్నారు. ఇంజెక్షన్లు, టీకాలు వేయడం ద్వారా.. కుక్కల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను నిలవరించవచ్చన్నారు. మరిన్ని వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలన్నారు. అయితే.. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ``సుప్రీంకోర్టులో చాలా కేసులు పెండింగులో ఉన్నాయి. కుక్కలకు ఆహారమే పెట్టండి. టైం ఇవ్వలేం. కుక్కల కేసే టైం తినేస్తే.. ఇతర కేసుల మాటేంటి?`` అని వ్యాఖ్యానించడంతో అందరూ నివ్వెర పోయారు.