విజయవాడ నగరంలోని మున్సిపల్ స్టేడియంలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. జాతీయజెండాను ఎగురవేసిన చంద్రబాబు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ప్రదర్శించిన శకటాలు, పరేడ్ ఆకట్టుకున్నాయి.
ఆ తర్వాత చంద్రబాబు ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకాన్ని నేడు ప్రారంభిస్తున్నామని తెలిపారు. "ప్రజలు గెలవాలి- రాష్ట్రం నిలవాలి అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చామని, 2024 ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారని అన్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ, రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామన్నారు. ఈ ఏడాది పాలనలో సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు అని గర్వంగా చెప్పారు. ఇది ఒక ఆల్ టైం రికార్డ్ అని సగర్వంగా ప్రకటించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, అందులో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందని చంద్రబాబు అన్నారు.