వైసీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లత విజయం దక్కించుకున్నారు. అది కూడా వైసీపీ అభ్యర్థి హేమంత్ కుమార్‌కు డిపాజిట్ కూడా దక్కని స్థాయిలో ఆమె విజృంభించారు. మొత్తంగా రాజకీయాలను గమనిస్తే.. పులివెందులలో జరిగిన ఈ ఉప ఎన్నిక అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బలంగా పోరాటం కూడా చేశాయి.
అయితే.. తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితంలో 6035 ఓట్లు టీడీపీ అభ్యర్థి లతకు పడ్డాయి. దీంతో ఆమె మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో విజయం దక్కించుకున్నట్టు అయింది. ఇక, వైసీపీ తరఫున పోటీలో ఉన్న హేమంత్‌కు 683 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో టీడీపీ విజయం నల్లేరుపై నడకే అన్నట్టుగా సాగిపోయింది. ఇక, ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం.. ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ తరఫున కూడా అభ్యర్థి పోటీలో ఉన్నారు. మొత్తంగా సుమారు 200 ఓట్లను వీరు లాగేశారు.
ఫలితంగా పులివెందుల అడ్డాలో జగన్ తాలూకు ప్రభావం తగ్గి.. తెలుగు దేశం హవా స్పష్టంగా కనిపించిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికల పోలింగ్‌లో మొత్తం 10601 ఓట్లకు గాను 74 శాతం మేరకు పోలింగ్ నమోదైంది. దీనిలో ఏకపక్షంగా ప్రజలు టీడీపీవైపు నిలబడ్డట్టు స్పష్టమైంది. ఇదిలావుంటే.. పులివెందులలో సత్తా చాటిని లతకు.. మంత్రులు అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు కూడా ఆమె కృషి, పట్టుదలను అభినందించారు. ఈ ఓటమి జగన్ నియంతృత్వానికి చెంపపెట్టు వంటిది అని రాజీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.