ఉమ్మడి కడప జిల్లాలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడ వైసీపీ చాలానే ఆశలు పెట్టుకుంది. ఇరగం రెడ్డి.. ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఒంటిమిట్ట నుంచి గెలిచి.. కనీసం ఒక్కచోటైనా తమ సత్తా చాటాలని వైసీపీ ఆశలు పెట్టుకుంది. అయితే.. తాజాగా ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండులోనూ.. వైసీపీకి చేదు అనుభవం ఎదురవుతోంది. టీడీపీ తరఫున ఇక్కడ నుంచి బరిలో ఉన్న ముద్దుకృష్ణ దూసుకుపోతున్నారు.
ఇదేసమయంలో వైసీపీ అభ్యర్థి ఇరగం రెడ్డి వెనక్కి తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా వెల్లడైన ఫలితం బట్టి.. మొదటి రౌండ్ లో టీడీపీ అభ్యర్థి కృష్ణరెడ్డి 4,632 ఓట్లు దక్కించుకున్నారు. ఇదేసమయం లో వైసీపీ అభ్యర్థి 1211 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. అంటే తొలి రౌండులోనే టీడీపీ మెజారిటీ 3421 కి చేరింది. ఈ పరిణామంతో ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉదయం నుంచి పడిగాపులు పడిన ఇరగం రెడ్డి వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అంటే.. దాదాపు ఒంటిమిట్టలోనూ.. వైసీపీ పరాజయం తప్పదన్న సంకేతాలు వచ్చాయి.
కారణం ఎవరు?
ఇక, వైసీపీ ఇంత ఘోర పరాజయానికి కారణంఎవరు? అనేది ఆ పార్టీలోనే చర్చకు దారి తీసింది. ఒంటిమి ట్టలో ఇప్పటి వరకు తమకు ఎదురు లేదని భావించిన ఆ పార్టీకి తొలిసారి పరాజయం ఎదురైంది. పైకి టీడీపీ దూకుడు అని చెబుతున్నా.. అంతర్గతంగా నాయకుల మధ్య సఖ్యత కొరవడడంతోపాటు అధినేత వ్యవహరిస్తున్న తీరును కూడా ఇరగం రెడ్డి తప్పుబడుతున్నారు. ఈ కారణంగానే ప్రజలకు తాము దూరమవుతున్నామని ఆయన రెండు రోజుల కిందటే వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఉండాలో వద్దో తేల్చుకునే సమయం వచ్చిందన్నారు. సో.. మొత్తంగా ఈ ప్రభావం జగన్‌పై ఎక్కువగా కనిపిస్తుండడం గమనార్హం.