79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ దేశ రక్షణ రంగానికి సంబంధించి చరిత్రాత్మక ప్రకటన చేశారు. 2035 నాటికి 'సుదర్శన చక్ర మిషన్' పేరుతో అత్యాధునిక ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేయబోతున్నామని ప్రకటించారు.
దేశంలోని అన్ని కీలక ప్రాంతాలకు పూర్తి భద్రత కల్పించేలా దానికి రూపకల్పన చేస్తామన్నారు. శ్రీ కృష్ణుడి ఆయుధమైన సుదర్శన చక్రం స్ఫూర్తితో ఆ పేరు పెట్టామన్నారు.గత పదేళ్లలో అభివృద్ధి చేసిన టెక్నాలజీతో 'ఆపరేషన్ సిందూర్' చేపట్టామని, తద్వారా పాకిస్థాన్ నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్ల దాడులను భారత్ సమర్థవంతంగా నిలువరించిందని మోదీ గుర్తుచేశారు.
ఎర్రకోట నుంచి అత్యంత సుదీర్ఘ ప్రసంగం(105 నిమిషాలు) చేసిన ప్రధానిగా మోదీ తన రికార్డును తానే బద్దలుకొట్టారు. గత ఏడాది ఆయన 98 నిమిషాల పాటు ప్రసంగించారు. ఎర్రకోట నుంచి వరుసగా 12వ సారి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన మోదీ..మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును అధిగమించారు. 17 సార్లు వరుసగా ఎర్రకోట నుంచి ప్రసంగించిన రికార్డు దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉంది.